గన్‌మెన్లను వెనక్కు పంపిన వైసీపీ ఎమ్మెల్యే.. కారణం అదేనా..?
అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి కంటే చులకనగా కొందరు అధికారులు చూస్తున్నారన్న ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.
రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అలకబూనారు. ఆయన తన గన్‌మెన్లను వెనక్క పంపారు. తనకు ఎవరి రక్షణ అవసరం లేదని చెబుతున్నారు. జగన్‌కు సన్నిహితుడైన కాపు రామచంద్రారెడ్డి కూడా అలక బూనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొందరు అధికారుల కారణంగానే ఆయన అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు.
తన సిఫార్సులను, విజ్ఞప్తులను వివిధ శాఖల అధికారులు, ముఖ్యంగా పోలీసు శాఖలోని అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదన్నది కాపు రామచంద్రారెడ్డి ఆవేదనకు కారణంగా చెప్పుకుంటున్నారు. తన దగ్గరి కార్యకర్తలకు సంబంధించిన పనులను కూడా చక్కబెట్టలేని పరిస్థితిలో ఎమ్మెల్యే ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ నియోజకవర్గంలోని కొందరు అధికారుల తీరును ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి కాపు రామచంద్రారెడ్డి తీసుకెళ్లారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆయన గన్‌మెన్లను వెనక్కు పంపినట్టు భావిస్తున్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి కంటే చులకనగా కొందరు అధికారులు చూస్తున్నారన్న ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. గన్‌మెన్‌లను ఎమ్మెల్యే వెనక్కు పంపడంపై మీడియా ప్రతినిధులు డీఎస్పీని ప్రశ్నించగా.. కారణాలేంటో ఎమ్మెల్యేనే అడగాల్సిందిగా సలహా ఇచ్చారు. మరో వాదన కూడా వినిపిస్తోంది. తన వ్యాపారాలు, వ్యక్తిగత అంశాలకు సంబంధించిన వివరాలను గన్‌మెన్లు ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నారన్న అనుమానం కూడా కాపులో ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన తొలి నుంచి కూడా గన్‌మెన్ల విషయంలో విముఖంగానే ఉన్నారని చెబుతున్నారు.