పార్టీలు శాశ్వతం కాదు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఈ పార్టీలో ఉంటాను, రేపు పోతాను.. పార్టీలు శాశ్వతం కాదు, నాయకులే శాశ్వతం అని అన్నారు.
పార్టీలేదు బొక్కా లేదు అంటూ ఆమధ్య ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం అయ్యాయో అందరికీ తెలుసు. ఇప్పటికీ వైసీపీ నేతలు ఆయన మాటలతో మీమ్స్ చేసి సెటైర్లు వేస్తుంటారు. సరిగ్గా ఇప్పుడు వైసీపీలో కూడా అలాంటి మాటలే బయటకొచ్చాయి. అయితే ఇక్కడ పార్టీని మరీ అంతలా తీసిపారేయలేదు కానీ.. పార్టీలు శాశ్వతం కాదు, నాయకులే శాశ్వతం అని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. ఈ రోజు ఈ పార్టీలో ఉంటాను, రేపు పోతాను.. పార్టీలు శాశ్వతం కాదు అని చెప్పారు. రేపు ఈ పార్టీ నుంచి ఇక్కడ ఎవరు పోటి చేస్తారో ఎవరికి తెలుసు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పార్టీలు ఎంత మంది మారటం లేదని కూడా ప్రశ్నించారు.
జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే చంటిబాబు.. ఇటీవల పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్లీనరీ తర్వాత, సీఎం జగన్ తో మీటింగ్ తర్వాత ఆయన స్వరం మారిందట. 2024లో వైసీపీ తరపున తనకు టికెట్ దక్కదు అని నిర్థారించుకున్న తర్వాతే చంటిబాబు ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో వైసీపీ టికెట్ పై గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2024 నాటికి ఆయన ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియాలి.
నియోజకవర్గంలో నూతన పింఛన్ల పంపిణీ సందర్భంలో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్ కమ్ ట్యాక్స్ కడుతున్నారంటూ ఓ వ్యక్తికి పింఛన్ ఆపేయడంతో ఆయన అధికారులపై మండిపడ్డారు. టెక్నికల్ సమస్యలు ఉంటే సానుకూలంగా స్పందించి అవకాశం ఉన్నంతవరకు బాధితులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలంటూ అధికారులకు క్లాస్ తీసుకున్నారు చంటిబాబు. తాను ఉన్నంతవరకు నియోజకవర్గ ప్రజల్ని సక్రమంగా చూసుకోవడం తన బాధ్యత అన్నారు. పింఛన్ తీసుకునేవాళ్లు ఇన్ కమ్ ట్యాక్స్ కట్టగలరా అని ప్రశ్నించారు. మొత్తమ్మీద జ్యోతుల చంటిబాబులో అసంతృప్తి ఇవాళ బయటపడింది. పార్టీని లెక్కచేయట్లేదు, అధినేతను కూడా ఆయన ఖాతరు చేసేలా కనిపించట్లేదు. అందుకే పార్టీలు శాశ్వతం కాదు అనేశారు ఎమ్మెల్యే చంటిబాబు. మరి దీనిపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.