చంద్రబాబుని బ్లాక్ మెయిల్ చేయడానికే పవన్ వారాహి యాత్ర
పవన్ సభలకు జనం భారీగా తరలిరావడంపై కూడా గ్రంధి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లకు ప్రజల్లో ఆదరణ ఉంటుందని, యాంకర్ అనసూయ రాజమండ్రి వచ్చినా జనం కిక్కిరిసిపోతారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేయడం కోసమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టారని భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
గోదావరి జిల్లాల్లో రౌడీయిజం పెరిగిపోయిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం పెద్ద జోక్ అని, పవనే మాటిమాటికి పీకనొక్కుతా, గుడ్డలూడదీసి కొడతా, మక్కెలు ఇరగదీసి కొడతా.. వంటి మాటలు మాట్లాడుతున్నారని, ఇవే పవన్ మేనిఫెస్టోలోని అంశాలని సెటైర్ వేశారు.
గోదావరి జిల్లాలను వైసీపీ రహిత జిల్లాలుగా చేద్దామని పవన్ కళ్యాణ్ అంటున్నారని, 2019 ఎన్నికల్లోనే గోదావరి జిల్లాల ప్రజలు జనసేనకు విముక్తి కలిగించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే పని చేస్తున్న పవన్, కాపులను తీవ్రంగా అవమానిస్తున్నారని గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ముందు పవన్ కళ్యాణ్ తన పార్టీ గుర్తును నిలబెట్టుకోవాలని, పార్టీని కాపాడుకోవడంపై దృష్టిపెట్టాలని సూచించారు.
పవన్ సభలకు జనం భారీగా తరలిరావడంపై కూడా గ్రంధి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లకు ప్రజల్లో ఆదరణ ఉంటుందని, యాంకర్ అనసూయ రాజమండ్రి వచ్చినా జనం కిక్కిరిసిపోతారని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నియోజకవర్గ ప్రజల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. అటువంటి పవన్ మరోసారి వస్తే ప్రజలు ఎలా నమ్ముతారని గ్రంధి శ్రీనివాస్ ప్రశ్నించారు.