రూ.30 కోట్లు ఇస్తే.. ఇల్లు నీకే రాసిచ్చేస్తా
చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని గ్రంధి శ్రీనివాస్ సవాల్ చేశారు. తనకు సొంతిల్లు లేదని. తన తమ్ముడి ఇంట్లో ఉంటున్నానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో జరిగిన టీడీపీ సభలో చంద్రబాబు చేసిన అవినీతి ఆరోపణలపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మండిపడ్డారు. రూ.50 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటున్నానంటూ తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సొంతిల్లు లేక తన తమ్ముడి ఇంట్లో ఉంటున్నానని చెప్పారు. తనకు రూ.30 కోట్లు ఇస్తే తాను కట్టుకుంటున్న ఇంటిని చంద్రబాబుకే రాసిచ్చేస్తానని ఈ సందర్భంగా ఆయన సవాల్ చేశారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రియాక్ట్ అయ్యారు.
చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని గ్రంధి శ్రీనివాస్ సవాల్ చేశారు. తనకు సొంతిల్లు లేదని. తన తమ్ముడి ఇంట్లో ఉంటున్నానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. స్థలం కొనుగోలు చేసుకోవడానికి డబ్బులు లేక తాతలు ఇచ్చిన స్థలంలోనే నిబంధనల ప్రకారం తాను బ్యాంకు లోన్ తీసుకుని ఇంటిని నిర్మించుకుంటున్నానని చెప్పారు. తాను భూ ఆక్రమణలు చేసినట్టు చంద్రబాబు ఆర్‌ఎస్ నంబర్లతో సహా నిరూపించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు జీవితం అంతా అబద్ధాలు, మోసపూరిత హామీలు, తప్పుడు ప్రచారాలే ఉంటాయని గ్రంధి శ్రీనివాస్ చెప్పారు. ప్రజలకు మేలు చేయడం తప్ప మోసం చేయడం తనకు తెలియదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గత నాలుగున్నరేళ్లలో భీమవరం నియోజకవర్గాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేసినట్టు ఆయన చెప్పారు. మరోసారి గుర్తుచేస్తున్నానని.. రూ.50 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటున్నానని ఆరోపణలు చేసిన చంద్రబాబు.. రూ.30 కోట్లు ఇస్తే ప్రస్తుతం కట్టుకుంటున్న ఇంటిని ఆయనకే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తానని ఆయన పునరుద్ఘాటించారు.