మనుషులకు మూడో కన్ను ఉంటుందా బాలకృష్ణా..? - కౌంటర్ ఇచ్చిన గోపిరెడ్డి
బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసలు మనుషులకు మూడో కన్ను ఉండదని.. బాలకృష్ణ అది తెలుసుకోవాలన్నారు.
తాను మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందోనని ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్లకు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసలు మనుషులకు మూడో కన్ను ఉంటుందా? బాలకృష్ణా.. అని ఎద్దేవా చేశారు. ఇటీవల నర్సరావుపేటలో జరిగిన ఆలయ వేడుకల్లో ఒక వ్యక్తి బాలకృష్ణ నటించిన సినిమాలోని పాట పెట్టగా.. ఆ వ్యక్తిని ఎమ్మెల్యే గోపిరెడ్డి మందలించినట్లు వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగా తాజాగా తెనాలిలో జరిగిన సినిమా అవార్డు ఫంక్షన్ లో పాల్గొన్న బాలకృష్ణ వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పై పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. తన సినిమా పాట వెయ్యవద్దని అభ్యంతరం వ్యక్తం చేయడం పట్ల ఫైర్ అయ్యారు. 'నేను చిటికేస్తే ఏం జరుగుతుందో తెలుసుకో. మూడో కన్ను తెరిచానంటే ఏమవుతుందో చూసుకో' అంటూ బాలకృష్ణ హెచ్చరించారు.
బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసలు మనుషులకు మూడో కన్ను ఉండదని.. బాలకృష్ణ అది తెలుసుకోవాలన్నారు. ఏదో ఒక వ్యాఖ్య చేయడం, ఆ తర్వాత తప్పైందని వెనక్కి తీసుకోవడం బాలకృష్ణకు ఇటీవల అలవాటుగా మారిందని విమర్శించారు.
తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు బాలకృష్ణకు ఏం పని..? అని ప్రశ్నించారు. సినిమాల్లో లాగా జీవితంలో నటించడం కుదరదన్నారు. బాలకృష్ణ హీరో అయితే అది ఆయన పార్టీకి గొప్ప అని, తనకు కాదని అన్నారు. బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, నియోజకవర్గంలో పనికిమాలిన వ్యక్తికి వత్తాసు పలికి స్థాయిని దిగజార్చుకోవద్దని గోపిరెడ్డి హితవు పలికారు.