Telugu Global
Andhra Pradesh

కేసీఆర్ మొనగాడు.. వైసీపీ ఎమ్మెల్యే ప్రశంస..

వైసీపీ నేతలంతా తమ సీఎం జగన్ ని సమర్థిస్తున్నా.. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే మాత్రం మోదీని ఢీకొట్టిన కేసీఆర్ మొనగాడు అంటూ కితాబిచ్చారు.

కేసీఆర్ మొనగాడు.. వైసీపీ ఎమ్మెల్యే ప్రశంస..
X

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రభుత్వంతో సంబంధాలు బాగానే ఉన్నాయి. ఆ తర్వాత నీటి వాటాల వద్ద గొడవలు మొదలై, ప్రస్తుతం ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. కేంద్రానికి మద్దతిచ్చే విషయంలో కూడా ఏపీ సీఎం జగన్ కాస్త ఉదారవాదంతో ఉన్నారు, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మోదీకి చుక్కలు చూపిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు కరెక్ట్. మోదీతో స్నేహం కోరుకుంటున్న ఏపీకి ఏం ఒరిగింది, ఎన్డీఏని ఎదుర్కొంటున్న కేసీఆర్ కి ఏం తరిగింది. వైసీపీ నేతలంతా తమ సీఎం జగన్ ని సమర్థిస్తున్నా.. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే మాత్రం మోదీని ఢీకొట్టిన కేసీఆర్ మొనగాడు అంటూ కితాబిచ్చారు.

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మొదటినుంచీ ఎన్డీఏ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. గతంలో గోవధ‌ నిషేధ చట్టంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారాయన. కేవలం ఓట్ల కోసం బీజేపీ ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ఆర్​ఎస్ఎస్, బీజేపీ.. మతసామరస్యాన్ని దెబ్బ తీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులకు గోవు పూజ్యనీయమైనదే కానీ, ముస్లింలకు ఆహార పదార్థం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఆ తర్వాత కూడా ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా ఎన్డీఏపై విమర్శలు చేస్తుంటారు. కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికే ఓటు వేశారు. తాజాగా ఆయన.. ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ నడుం బిగించాలన్నారు. ఈ పోరాటంలో కేసీఆర్ అందరికీ ఆదర్శనీయుడని కొనియాడారు.

రాష్ట్రాల అభివృద్ధికి సహకరించని మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలన్నారు చెన్నకేశవరెడ్డి. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఢీకొన్న ఏకైక మొనగాడు సీఎం కేసీఆర్ అని అన్నారు. అధికారం కోసం.. ఇతర ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను 20కోట్లు ఇచ్చి బీజేపీ కొనుగోలు చేస్తోందని విమర్శించారు. ఇలాంటి దుర్మార్గ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఒక్క తాటి పైకి రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ కూడా మోదీని గద్దె దించేందుకు టీఆర్ఎస్ తో చేతులు కలపాలని చెప్పారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి.

First Published:  25 Aug 2022 4:28 PM IST
Next Story