Telugu Global
Andhra Pradesh

ఆత్మహత్యాయత్నం చేసిన వైసీపీ ఎమ్మెల్యే బావమరిది

ఆయన కోసం 30 ఎకరాలు భూమిని అమ్మానని, అప్పుల్లో కూరుకుపోయి 2 కోట్ల రూపాయలు కావాలని ఏడిస్తే తానే ఇచ్చానని.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాత్రం తనను పార్టీ నుంచి బయటకు పంపించారని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు.

ఆత్మహత్యాయత్నం చేసిన వైసీపీ ఎమ్మెల్యే బావమరిది
X

శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ సొంత బావమరిది ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు రాగా వారినీ దగ్గరకు రావొద్దు అంటూ హెచ్చరిస్తూ కత్తితో గాయాలు చేసుకున్నారు.

తన బావ, ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి వేధిస్తున్నారంటూ అర్ధ‌రాత్రి ఫాం హౌస్‌లో చేతిపై కత్తితో కోసుకున్నారు. పొట్ట, నడుము వద్ద కూడా గాయాలు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న స్నేహితులు, బంధువులు అక్కడికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. ఈ విషయం బయటకు రావడంతో సీఐలు భాస్కర్ నాయక్, విక్రం అక్కడకి వచ్చి ఆరా తీశారు.

సీఐలతోనూ శ్రీధర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ''నన్ను కాల్చి చంపేయండి. మీకు డీఎస్పీలుగా ప్రమోషన్లు వస్తాయి.. అంతకంటే మీకేం కావాలి?'' అంటూ శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కత్తితో గోడపైకి ఎక్కి పోలీసులు వెళ్లిపోవాలని లేకుంటే పొడిచేసుకుంటా అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత డీఎస్పీనే స్వయంగా శ్రీధర్ రెడ్డితో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు.

ఎన్నికలకు ముందు మధుసూదన్‌ రెడ్డికి ఎంతో సాయం చేశానని.. గెలిచిన తర్వాత తనను వేధిస్తున్నారని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. తినేందుకు తిండికూడా లేని మధుసూదన్‌ రెడ్డికి తాను సాయం చేశానని.. ఆయన కోసం 30 ఎకరాలు భూమిని అమ్మానని, అప్పుల్లో కూరుకుపోయి 2 కోట్ల రూపాయలు కావాలని ఏడిస్తే తానే ఇచ్చానని.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాత్రం తనను పార్టీ నుంచి బయటకు పంపించారని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు.

తాను ఇవన్నీ చేయలేదని ఎమ్మెల్యే, ఆయన కుమార్తె గుడి వద్ద ప్రమాణం చేయాలని శ్రీధర్ రెడ్డి సవాల్ చేశారు. తన భర్త మధుసూదన్ రెడ్డి తలుచుకుంటే రౌడీలను పంపించి అరగంటలో చంపించేస్తాడు అంటూ తన సోదరి, ఎమ్మెల్యే భార్య శ్రీవాణి బెదిరిస్తోందని శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఎన్నికల సమయంలో బావ గెలుపు కోసం శ్రీధర్ రెడ్డి గట్టిగానే కష్టపడ్డారు. ఎన్నికల తర్వాత వీరి మధ్య విభేదాలు వచ్చాయి.

First Published:  4 Dec 2022 3:01 AM GMT
Next Story