Telugu Global
Andhra Pradesh

జగన్ మీద కసి తీర్చుకుంటున్నారా..?

మంత్రిగా పనిచేసినప్పుడు డబ్బులు తీసుకున్నారట. ఎమ్మెల్యేగా మాత్రం నిజాయితీగా పనిచేశారట. తాను నీతిమంతుడినని చెప్పుకోలేరట. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కాశారట.

జగన్ మీద కసి తీర్చుకుంటున్నారా..?
X

అధికార పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఏమైందో అర్థంకావటంలేదు. జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువునని చెప్పుకుని తిరుగుతున్న బాలినేనికి బహిరంగంగా ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో కూడా తెలీదా..? అని ఆశ్చర్యంగా ఉంది. ఒంగోలు పార్టీ నేతలు, క్యాడర్ సమావేశంలో బాలినేని మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. ఈ మాటలను చూస్తుంటే జగన్ ప్రభుత్వంపై బురదచల్లేందుకే బాలినేని ఇలా మాట్లాడారా..? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

ఇంతకీ బాలినేని ఏమన్నారంటే.. మంత్రిగా పనిచేసినప్పుడు డబ్బులు తీసుకున్నారట. ఎమ్మెల్యేగా మాత్రం నిజాయితీగా పనిచేశారట. తాను నీతిమంతుడినని చెప్పుకోలేరట. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కాశారట. కాంగ్రెస్‌కు ఖాయంగా 65 సీట్లొస్తుందని మరో రూ. 60 లక్షలు పందెం కాసే అవకాశం వచ్చినా.. తన కొడుకు వద్దనటంతో మానేసినట్లు చెప్పారు. ఒంగోలులో నేతలు, క్యాడర్ మనస్ఫూర్తిగా పనిచేస్తానంటేనే వచ్చేఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తే తన కుటుంబానికి ఇరిటేషన్‌గా ఉందన్నారు.

బాలినేని మాటలు విన్న తర్వాత అసలు ఆయన స్పృహలో ఉండే మాట్లాడారా..? అనే అనుమానం వస్తోంది. మంత్రిగా పనిచేసినప్పుడు డబ్బులు తీసుకున్నట్లు బహిరంగంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని రూ. 50 లక్షలు పందెం కాసినట్లు చెప్పాల్సిన అవసరం ఏమిటో అర్థంకావటంలేదు. తాను నీతిమంతుడినని చెప్పుకోవటంలేదన్నారు. తన కొడుక్కి జగన్ అంటే పిచ్చని కాకపోతే ఆయనకే తమపైన లేదన్నారు.

నేతలు, క్యాడర్ సమావేశంలో బాలినేని చేసిన వ్యాఖ్యలను టీడీపీ బాగా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. బాలినేని చేసిన వ్యాఖ్యలను విన్నతర్వాత కావాలనే జగన్ పై బురదచల్లేయటానికే చేసినట్లుంది. నిజానికి జగన్‌కు బాలినేని పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. మాజీ ఎంపీ, ద‌గ్గ‌రి బంధువు వైవీ సుబ్బారెడ్డికి బాలినేనికి మధ్య సంబంధాలు ఉప్పు నిప్పని అందరికీ తెలిసిందే. తాను కోరుకుంటున్నట్లు వైవీని జగన్ కంట్రోల్ చేయటంలేదని చాలాకాలంగా బాలినేని మండిపోతున్నారు. పైగా బాలినేని బ్లాక్ మెయిలింగుతో విసిగిపోయిన జగన్ దూరంగా పెట్టేశారు. దాంతో జగన్‌పై బురదచల్లేయాలని బాలినేని డిసైడ్ అయినట్లున్నారు. లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలను బహిరంగంగా చేయరు.

First Published:  10 Dec 2023 10:00 AM IST
Next Story