జగన్ కోసం మంత్రి పదవిని వదిలేసుకొని వచ్చా..
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో బాలినేని అనుచరులు, ఆయన దగ్గర కుటుంబ సభ్యులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రకాశం జిల్లా వైసీపీలో చక్రం తిప్పిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు) ఇటీవల ఇబ్బందుల్లో పడ్డారు. తన సొంత బావ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తనకు పార్టీలో శత్రువుగా మారారని బాలినేని బలంగా భావిస్తున్నారు. ప్రొటోకాల్ వివాదాలు, పోలీసులతో పొసగకపోవడం, ఇప్పుడు భూకబ్జాల ఆరోపణలు.. ఇలా వరుసగా తనను చుట్టుముడుతున్న వివాదాలు బావ పుణ్యమేనని బాలినేని నారాజ్‌గా ఉన్నారు. ఈ క్రమంలో నిన్న ఆయన తాడేపల్లి వచ్చి సీఎం జగన్‌తో భేటీ కావడం పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
భూకబ్జాలపై సీఎంకు వివరణ
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో బాలినేని అనుచరులు, ఆయన దగ్గర కుటుంబ సభ్యులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత 2 నెలల్లో ఒంగోలులో భూకబ్జాలపై ఏకంగా 130 ఫిర్యాదులు పోలీస్ స్టేషన్‌కు చేరాయి. కొన్ని కేసులూ నమోదయ్యాయి. దీంతో బాలినేని సీఎం జగన్‌ను కలిసి వీటి వ్యవహారంపై వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రతిపక్షాల పనేనంటూ ప్రకటన
సీఎంను కలిసిన అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. ఈ భూకబ్జాలు ఇప్పటివి కావని గత 10, 12 ఏళ్లుగా జరుగుతున్నవేనని చెప్పుకొచ్చారు. అంటే 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న టీటీపీ నేత జనార్దన్‌కు కూడా దీనితో సంబంధం ఉందన్నట్లు మాట్లాడారు. ఈ వ్యవహారంలో తమ పార్టీ వారితోపాటూ టీడీపీ వాళ్లను పోలీసులు అరెస్టు కూడా చేశారని వాసు చెప్పారు.
టీడీపీలోకి వెళతాననే వాళ్ల భయం
తాను ఎక్కడ టీడీపీలోకి వెళతానో, వెళితే తనకే టికెటిస్తారని, అప్పుడు టికెట్ దక్కదని తన ప్రత్యర్థి దామచర్ల జనార్దన్ భయపడుతున్నారని బాలినేని కామెంట్ చేయడం ఇక్కడ హైలెట్. ఇన్ని మాటలు చెబుతూనే తాను జగన్ కోసం కాంగ్రెస్‌లో మంత్రి పదవి వదులుకుని బయటికి వచ్చానని, ఇప్పుడు ఆయన్ను వదిలి ఎందుకు వెళతానని చెప్పడం కొసమెరుపు.