నెల్లూరులో అరాచకాలు పెరిగిపోయాయి.. స్టేషన్ ముందు ఆనం బైఠాయింపు
స్టేషన్ ముందు ఎమ్మెల్యే బైఠాయించారని తెలుసుకున్న ఎస్పీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి ఆనంతో చర్చ జరిపారు. చైర్మన్, ఉద్యోగిని పోలీసులు వదిలి పెట్టారు.
నెల్లూరులో అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డే రోడ్కెక్కారు. నెల్లూరులో ఆరాచకాలు పెరిగాయని ఆయన ఆరోపించారు. నేటి నుంచి నగరంలో అక్రమాలను అడ్డుకునేందుకు తాను, తన సోదరులు ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించారు.
నెల్లూరులోని వేణుగోపాల స్వామి దేవస్థానం స్థలంలో కొందరు ఇటీవల టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు. ఆలయ చైర్మన్, మరో ఉద్యోగి కలిసి ఆ టిఫిన్ సెంటర్‌ను తొలగించారు. ఆలయ భూములను ఆక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇంతలో టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకున్న మహిళ.. ఆలయ చైర్మన్, ఉద్యోగిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.
పోలీసులు ఆలయ చైర్మన్, ఉద్యోగిని స్టేషన్‌ను తీసుకెళ్లారు. మధ్యాహ్నం వెళ్లినవారు సాయంత్రం అయినా స్టేషన్ నుంచి బయటకు రాలేదు. ఆనం రామనారాయణ రెడ్డి ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదు. దాంతో నేరుగా ఆనం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బైఠాయించారు. భూములు ఆక్రమణకు గురి కాకుండా అడ్డుకున్న చైర్మన్‌పైనే తిరిగి ఎలా కేసు పెడుతారని ప్రశ్నించారు.
స్టేషన్ ముందు ఎమ్మెల్యే బైఠాయించారని తెలుసుకున్న ఎస్పీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి ఆనంతో చర్చ జరిపారు. చైర్మన్, ఉద్యోగిని పోలీసులు వదిలి పెట్టారు. తానే నేరుగా పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ ఏం జరుగుతోందో అర్థం చేసుకోవాలని ఆనం వ్యాఖ్యానించారు. రాజకీయాలు, పార్టీలు ఏవైనా సరే ఇకపై అన్యాయానికి గురైన వారికి ఆనం కుటుంబం అండగా ఉంటుందని రామనారాయణరెడ్డి ప్రకటించారు.