విజయవాడ వెస్ట్‌లో వైసీపీ మైనార్టీ కార్డుకు గింగిరాలు తిరుగుతున్న టీడీపీ
ఈ నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ దెబ్బతో టీడీపీ, జనసేన కూటమి ఏం చేయాలో తోచని స్థితిలో పడింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి పంపిన జగన్.. పశ్చిమ స్థానాన్ని మైనార్టీలకు కేటాయించారు. షేక్ ఆసిఫ్‌ను నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ దెబ్బతో టీడీపీ, జనసేన కూటమి ఏం చేయాలో తోచని స్థితిలో పడింది.
నేనే అభ్యర్థిని అంటున్న బుద్దా.. మైనార్టీల మాటేమిటని జలీల్‌ఖాన్ ప్రశ్న
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తానే అభ్యర్థినని టీడీపీ బీసీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పదేపదే ప్రకటించుకున్నారు. తన వివాహ వార్షికోత్సవం అంటూ నియోజకవర్గంలో భారీ ర్యాలీ కూడా తీసి బలప్రదర్శన చేశారు. తనకు కాకపోతే టీడీపీ మైనార్టీ నేత నాగుల్‌మీరాకు టికెటిచ్చినా అభ్యంతరం లేదని మొన్నటి వరకు చెప్పిన బుద్దా.. ఇప్పుడు ఆమాట ఎత్తడం లేదంటున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే, బీకాంలో ఫిజిక్స్ వ్యాఖ్యలతో ఫేమస్ అయిన జలీల్‌ఖాన్ ఈ సీటు మైనార్టీలకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. అంటే తనకే ఇవ్వాలన్నది ఆయన డిమాండ్. మైనార్టీలు బలంగా ఉండి ఎమ్మెల్యే అవగలిగే అతి కొద్ది నియోజకవర్గాల్లో విజయవాడ వెస్ట్ ఒకటని, ఇక్కడ ముస్లింలకు టికెట్ ఇవ్వకపోతే వారి మనోభావాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానిస్తున్నారు. మరో మైనార్టీ నేత బేగ్ కూడా టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు.
పొత్తులో జనసేకు వెళితే ఏంటి పరిస్థితి?
మరోవైపు ఇక్కడ జనసేన నాయకుడు పోతిన మహేష్ చాలా చురుగ్గా ఉన్నారు. పొత్తులో ఈ స్థానం జనసేనదేనని, తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. గత నాలుగున్నరేళ్లుగా ఒకప్పటి మంత్రి, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వెలంపల్లిపై ఆరోపణలతో నిత్యం వార్తల్లో ఉంటూ వస్తున్న పోతిన ఈ సీటుపై గట్టిగా కన్నేశారు. ఒంటరిగా పోటీ చేసి గత ఎన్నికల్లో 22,370 ఓట్లు తెచ్చుకున్నానని, ఈసారి పొత్తులో గ్యారంటీగా గెలుస్తానంటున్నారు.
ఒక్క దెబ్బతో సమీకరణాలు మార్చేసిన జగన్
ఈ నియోజకవర్గంలో వెలంపల్లి శ్రీనివాస్‌ను వైసీపీ నిలబెడితే ఎలాగూ టీడీపీ, జనసేన పొత్తు ఉంటుంది కాబట్టి బీసీ ఓట్లు, కాపుల ఓట్లకు తమ పార్టీకి ఉన్న కొద్దో గొప్పో మైనార్టీ ఓట్లు కూడా కలిసొచ్చి గెలిచేస్తామని టీడీపీ నేత బుద్దా వెంకన్న, జనసేన నేత పోతిన మహేష్ కూడా భావించారు. అయితే జగన్ ఈ టికెట్ మైనార్టీ నేత ఆసిఫ్‌కు ఇవ్వడంతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అయింది. మైనార్టీలకు ఇస్తే పరిస్థితేంటి..? ఇవ్వకపోతే నష్టమేంటో తేల్చుకోలేక టీడీపీ బిత్తరచూపులు చూస్తోంది.