Telugu Global
Andhra Pradesh

ఔను.. ఆ ముగ్గురూ ఎచ్చెర్లని ఇష్ట‌ప‌డుతున్నారు..

త‌న జీవిత‌కాల‌మంతా బొత్స షాడోగా ప‌నిచేసిన మ‌జ్జి శ్రీనివాస‌రావు (చిన్న‌శ్రీను) ఇప్పుడు తాను అదే పొజిష‌న్‌లో నేరుగా ఉండాల‌నుకుంటున్నార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎచ్చెర్ల నుంచి చిన్న శ్రీను బరిలోకి దిగుతార‌ని కేడ‌ర్ చ‌ర్చించుకుంటున్నారు.

ఔను.. ఆ ముగ్గురూ ఎచ్చెర్లని ఇష్ట‌ప‌డుతున్నారు..
X

జిల్లా శ్రీకాకుళం, పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం విజ‌య‌న‌గ‌రం. ఇదీ ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్యేక‌త‌. శ్రీకాకుళం ప‌ట్ట‌ణానికి ఆనుకుని ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గం విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజ‌కీయాల‌కు కేంద్ర‌బిందువు అవుతూ వ‌స్తోంది. ఎచ్చెర్ల జ‌న‌ర‌ల్ అయిన నుంచీ ప్రముఖులు ఇక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని ఉవ్విళ్లూరే వారు. 2014 ఎన్నిక‌ల్లో గెలిచిన కిమిడి క‌ళా వెంక‌ట‌రావు ఏపీ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌విని అలంక‌రించారు. అలాగే విద్యుత్ శాఖా మంత్రిగా ప‌నిచేశారు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా పోటీచేసిన గొర్లె కిర‌ణ్‌కుమార్ తిరుగులేని మెజారిటీతో గెలిచారు. అయితే గెలిచిన నుంచి ప్ర‌జ‌ల‌కు, కేడ‌ర్ కూ దూరం పాటించ‌డం వ‌ల్ల ఎమ్మెల్యేపై వ్య‌తిరేక ప్ర‌చారం జోరందుకుంది. ఇది తీవ్ర‌స్థాయికి చేర‌డంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కిర‌ణ్‌కి టికెట్ రావ‌డం అనుమాన‌మే అనేది బ‌ల‌ప‌డిపోయింది. వైసీపీ స‌ర్వేలలో కూడా ఎమ్మెల్యే ప‌నితీరు చాలా ఘోరంగా ఉంద‌ని తేలింది.

వైసీపీకి గ‌ట్టి ప‌ట్టున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు చాలా మంది త‌మ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. అయితే వైసీపీకి చెందిన బిగ్ షాట్స్ ఎచ్చెర్ల‌పై మ‌న‌సు పారేసుకున్నార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కి మొద‌టి నుంచీ ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గంతో స‌త్సంబంధాలున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌న కుమారుడిని రాజ‌కీయ అరంగేట్రం చేయించాలంటే సుర‌క్షిత‌మైన నియోజ‌క‌వ‌ర్గం కావాలి. వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డిని ఒప్పించుకోగ‌లిగితే చీపురుప‌ల్లి నుంచి త‌న‌యుడిని దింపాల‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆలోచ‌న అని వార్త‌లు వ‌స్తున్నాయి.

అదే జ‌రిగితే ఎచ్చెర్ల నుంచి తాను పోటీకి దిగాల‌నేది బొత్స వ్యూహం అని అంటున్నారు. మ‌రోవైపు త‌న జీవిత‌కాల‌మంతా బొత్స షాడోగా ప‌నిచేసిన మ‌జ్జి శ్రీనివాస‌రావు (చిన్న‌శ్రీను) ఇప్పుడు తాను అదే పొజిష‌న్‌లో నేరుగా ఉండాల‌నుకుంటున్నార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎచ్చెర్ల నుంచి చిన్న శ్రీను బరిలోకి దిగుతార‌ని కేడ‌ర్ చ‌ర్చించుకుంటున్నారు. ఎచ్చెర్ల‌పై మ‌న‌సు పారేసుకున్న ముచ్చ‌ట‌గా మూడో కృష్ణుడు విజ‌య‌న‌గ‌రం వైసీపీ ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌. త‌న‌కు ఎంపీ ప‌ద‌వి సంతృప్తినివ్వ‌లేద‌ని, ఎమ్మెల్యేగా అయితే ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌గ‌ల‌న‌ని స‌న్నిహితుల వ‌ద్ద త‌న కోరిక వెల్ల‌డిస్తున్నార‌ట‌. తన‌కు వైసీపీ అధిష్టానం అవ‌కాశం ఇస్తే ఎచ్చెర్ల నుంచి పోటీకి దిగుతాన‌ని చెబుతున్నార‌ట‌. వైసీపీలో ఇంత‌మంది ఎచ్చెర్ల సీటుపై మ‌న‌సు పారేసుకోవ‌డానికి కార‌ణం మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిర‌ణ్‌కుమార్ వైఫ‌ల్య‌మేన‌ని కేడ‌ర్ అంటోంది.

First Published:  7 Jan 2023 7:26 AM IST
Next Story