కక్ష సాధించాలనుకుంటే మొదటి నెలలోనే అరెస్ట్ చేసేవాళ్లం
చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం ముందు అందరూ సమానులేనని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన చెప్పారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేయడంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఇది ప్రభుత్వ కక్షసాధింపు చర్య అని ఆరోపిస్తున్నారు. కావాలనే చంద్రబాబును అన్యాయంగా ఇరికించాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. చంద్రబాబుపై కక్షసాధింపు చేపట్టాలంటే నాలుగేళ్లు పట్టేదా అంటూ ప్రశ్నించారు. కక్షసాధించాలనే అనుకుంటే మొదటి నెలలోనే చేసేవాళ్లమని తెలిపారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ పేరిట కేటాయించిన కోట్లాది రూపాయల్లో అవినీతి జరిగిందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలోనే ప్రస్తావించారని ఈ సందర్భంగా సుబ్బారెడ్డి గుర్తుచేశారు. షెల్ కంపెనీలకు నగదు బదలాయించి అవినీతికి పాల్పడిన విషయమై పూర్తి ఆధారాలతో న్యాయస్థానంలో పెట్టామని వివరించారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబు అరెస్టయ్యారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం ముందు అందరూ సమానులేనని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేస్తే కనీసం ప్రజలు స్పందించడం లేదంటేనే అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఆయనపై ప్రజలకు ఎంత కోపం ఉందో దీనిని బట్టే తెలుస్తోందన్నారు.