Telugu Global
Andhra Pradesh

ఉచిత ఇసుక పేరుతో వేలకోట్లు దోచేశారు.. సజ్జల రామకృష్ణారెడ్డి

చంద్రబాబు నాయుడు తన హయాంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఈ సందర్భంగా సజ్జల చెప్పారు. అక్రమాలపై ఆధారాలున్నాయని భావిస్తేనే సీఐడీ కేసులు నమోదు చేస్తుంద‌ని తెలిపారు.

ఉచిత ఇసుక పేరుతో వేలకోట్లు దోచేశారు.. సజ్జల రామకృష్ణారెడ్డి
X

చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక పేరుతో వేల కోట్ల రూపాయలు దోచేశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు తమవారికి లబ్ధి చేకూరేలా రెండు సార్లు ఇసుక పాలసీని మార్చారని ఆయన చెప్పారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని వివరించారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఈ సందర్భంగా సజ్జల చెప్పారు. అక్రమాలపై ఆధారాలున్నాయని భావిస్తేనే సీఐడీ కేసులు నమోదు చేస్తుంద‌ని తెలిపారు.

చంద్రబాబు కోసమే పనిచేస్తున్న పురందేశ్వరి..

ఉచితంగా ఇసుక ఇవ్వడం అంటే.. ఎవరికి కావాలంటే వారు తెచ్చుకోవాలని అర్థమని, కానీ అలా జరగలేదని, సామాన్య ప్రజలకు కాకుండా చంద్రబాబుకు కావాల్సినవారికి ప్రయోజనం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నారని సజ్జల తెలిపారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఫిర్యాదు చేస్తే చంద్రబాబుపై కేసు ఎందుకు పెడతారన్నారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే సీఐడీ కేసు నమోదు చేసిందని స్పష్టం చేశారు. చంద్రబాబు కోసమే పురందేశ్వరి పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్‌కు షర్మిల మద్దతివ్వడం విధాన నిర్ణయం కావచ్చు..

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి వైటీపీ అధ్యక్షురాలు షర్మిల మద్దతివ్వడం ఆమె పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం కావచ్చని సజ్జల అభిప్రాయపడ్డారు. అయినా పక్క రాష్ట్ర విషయాల గురించి సీఎం జగన్‌ పెద్దగా పట్టించుకోరని ఆయన తెలిపారు. వైఎస్‌ కుటుంబాన్ని కాంగ్రెస్‌ ఇబ్బంది పెట్టిందన్న విషయం అందరికీ తెలుసని, సోనియా దగ్గరికి వెళ్లినప్పుడు జగన్‌తో పాటు షర్మిలమ్మ కూడా వచ్చిందని, అయినా విధానపరమైన నిర్ణయంలో భాగంగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చి ఉండొచ్చని సజ్జల అభిప్రాయపడ్డారు.

First Published:  4 Nov 2023 2:39 AM GMT
Next Story