Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ఓటుకు రెండు వేలు సిద్ధం చేస్తున్నారు- సజ్జల

వచ్చే ఎన్నికల్లో ఓటుకు రెండు వేలు పంచేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని, ఈ సొమ్ము అంతా ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. మీడియా సంస్థలపై ఆధారపడిన టీడీపీ ఒక మాయను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

చంద్రబాబు ఓటుకు రెండు వేలు సిద్ధం చేస్తున్నారు- సజ్జల
X

అక్రమంగా నిర్మించిన లింగమనేని భవనంలోకి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఎలా వెళ్లారో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఏ క్విడ్‌ ప్రోకో లేకుండానే చంద్రబాబుకు లింగమనేని ఈ నివాసాన్ని ఎందుకు ఇచ్చి ఉంటారని ప్రశ్నించారు. ఆ ఇంటిని చంద్రబాబు అద్దెకు తీసుకున్నట్టుగా ఎలాంటి ఒప్పందాలు కూడా లేవన్నారు. చంద్రబాబుకు లింగమనేని రమేష్‌కు మధ్య క్విడ్ ప్రోకో ఉందని.. ఇందుకు పక్కా ఆధారాలు ఉన్నాయని సజ్జల చెప్పారు.

14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఒక నాయకుడు అలా అక్రమ కట్టడంలో ఉండటం ఎంతవరకు కరెక్ట్ అని సజ్జల ప్రశ్నించారు. ఆ భవనాన్ని దేశభక్తితో ప్రభుత్వానికి ఇచ్చినట్టు గతంలో లింగమనేని రమేష్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి ఇచ్చిన భవనంలో అధికారం పోయిన తర్వాత కూడా చంద్రబాబు ఎలా ఉంటున్నారని నిలదీశారు. ఇప్పటికైనా ఏ హోదాలో ఆ భవనంలో చంద్రబాబు ఉంటున్నారో చెప్పాలన్నారు.

పాము పుట్టలో చేరినట్టుగా చంద్రబాబు లింగమనేని భవనంలో చేరుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ఒక బరితెగింపు ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఏ రహస్య ఒప్పందం లేకుంటే లింగమనేని భూములను ల్యాండ్ పూలింగ్‌లోకి తీసుకోకుండా ఎందుకు వదిలేశారో సమాధానం చెప్పాలన్నారు. ఇది రాచరికం కాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఓటుకు రెండు వేలు పంచేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని, ఈ సొమ్ము అంతా ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. మీడియా సంస్థలపై ఆధారపడిన టీడీపీ ఒక మాయను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేలా ఉన్నాయని సజ్జల వ్యాఖ్యానించారు.

First Published:  15 May 2023 2:47 PM IST
Next Story