Telugu Global
Andhra Pradesh

టీడీపీ కంటే అంతర్జాతీయ దొంగల ముఠా నయం

’బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు ఇళ్లల్లోకి చొరబడుతున్నారన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకుని ఒక యాప్‌లో నమోదు చేస్తున్నారని, ఓటీపీ వస్తే క్లిక్‌ చేయమంటున్నారని తెలిపారు.

టీడీపీ కంటే అంతర్జాతీయ దొంగల ముఠా నయం
X

నరనరాన వికృత ఆలోచనల మనస్తత్వం ఉన్న చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కంటే అంతర్జాతీయ దొంగల ముఠానే నయమని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీకి చెందిన పచ్చ దొంగల ముఠా ఊళ్ల మీదకొచ్చి పడుతోందని.. పట్టపగలే ఇళ్లలోకి చొరబడుతోందని.. ఆ ముఠా చేసే తప్పుడు ప్రచారాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ చేస్తున్న మోసాలను ఈ సందర్భంగా ఆయన సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు.

మేనిఫెస్టో ఖరారు కాకున్నా ప్రలోభాలకు యత్నం..

’బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు ఇళ్లల్లోకి చొరబడుతున్నారన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకుని ఒక యాప్‌లో నమోదు చేస్తున్నారని, ఓటీపీ వస్తే క్లిక్‌ చేయమంటున్నారని తెలిపారు. దాన్ని క్లిక్‌ చేస్తే ’భవిష్యత్తుకు గ్యారెంటీ’ అంటూ కార్డు వస్తోందన్నారు. ఆ కార్డులో.. ’ఐదేళ్లలో రూ.2.40 లక్షలు పొందేందుకు మీరు అర్హత సాధించారు.. మీకు అభినందనలు.. 2024 జూన్‌ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమచేయడం ప్రారంభమవుతుంది’ అంటూ ఇటీవల రాజంపేటకు చెందిన మర్రి మౌనికకు చెప్పారన్నారు. చంద్రబాబే అధికారంలోకి వచ్చేసినట్లు ప్రతిజ్ఞ చేస్తూ సంతకంచేసి మరీ ఒక గ్యారెంటీ పత్రం ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఓటరు కార్డు నంబరు, మొబైల్‌ నంబర్‌ సహా అన్ని వివరాలు సేకరిస్తున్నారన్నారు. మరో ఇంటికెళ్లి రూ.6.90 లక్షలు వస్తుందని చెప్పుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చాపకింద నీరులా టీడీపీ వాళ్లు నిర్వహిస్తున్నారని విమర్శించారు.

ప్రజల వ్యక్తిగత డేటా చోరీ..

నిజానికి.. హామీలను రాతపూర్వకంగా ఇచ్చేదే మేనిఫెస్టో అని.. అధికారంలోకి వస్తే దాన్ని అమలు చేయాలని.. కానీ, 2014లో టీడీపీ తన హామీలను అమలు చేయలేక మోసం చేసిందని గుర్తుచేశారు. అప్పట్లో మోడీ, పవన్‌ కళ్యాణ్‌ ఫొటోలతో 650 హామీలను అమలు చేస్తానంటూ ప్రజలకు సంతకం చేసి మరీ చంద్రబాబు లేఖలు రాశారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయకుండా.. దానిపై ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో టీడీపీ వెబ్‌సైట్‌ నుంచే దాన్ని మాయం చేశారని మండిపడ్డారు.

ఇప్పుడు లేని మేనిఫెస్టోతో మళ్లీ ప్రజల వద్దకు చంద్రబాబు వెళ్తున్నాడని, ఇంటింటికీ వెళ్లి మీకు పథకాలు వచ్చేశాయి.. అభినందనలు.. అంటూ చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. వారెంటీ లేని గ్యారెంటీలతో ప్రజలను మోసం చేస్తున్న ఇతన్ని ఏ చట్టం ప్రకారం శిక్షించవచ్చో ప్రజలే ఆలోచించాలన్నారు. ఇక ఇది సైబర్‌ క్రైం కిందకు వస్తుందని, ఓటరు కార్డు కూడా తీసుకుని పౌరుల వ్యక్తిగత గోప్యతలోకి కూడా వచ్చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

First Published:  22 Nov 2023 8:27 AM IST
Next Story