Telugu Global
Andhra Pradesh

బాబు మెడికల్‌ రిపోర్టు ఇచ్చింది డాక్టర్లేనా..?

చంద్రబాబు జైలులో ఉన్నా బయట ఉన్నా తమకేమీ ఇబ్బంది లేదని సజ్జల స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కుంభకోణం జరిగిందన్న విషయం పక్కకి పోతోందని ఆయన చెప్పారు.

బాబు మెడికల్‌ రిపోర్టు ఇచ్చింది డాక్టర్లేనా..?
X

చంద్రబాబు మెడికల్‌ రిపోర్టు ఇచ్చింది డాక్టర్లేనా..? లేక రాజకీయ నాయకులా..? అంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి చిత్ర విచిత్రమైన రిపోర్టులను ఇప్పుడే చూస్తున్నామని ఆయన చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సజ్జల మాట్లాడారు. గుండె సంబంధిత ఇబ్బందులు ఉంటే వెంటనే స్టంట్‌ వేయటమో, బైపాస్‌ సర్జరీనో చేయాలన్నారు. అంబులెన్స్‌ని వెంటబెట్టుకుని బయట తిరగమని డాక్టర్లు రిపోర్టు ఇచ్చారంటే ఇక వారిని ఏమనాలని ఆయన ప్రశ్నించారు. రోగం ఉంటే వైద్యం చేయించుకోవటం సహజమేనని, కానీ క్యాన్సర్‌ లాంటి రోగం ఉందో లేదో పరీక్షలు చేయాలని రిపోర్టు రాయటం ఏమిటని నిలదీశారు. ఇలాంటి చిత్ర విచిత్రమైన రిపోర్టులు ఇప్పుడే చూస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు. ఇప్పుడు సర్జరీలు చేయకపోతే మనిషి ఉంటాడో లేదో అన్నట్టుగా రిపోర్టులు తెచ్చుకోవటం చంద్రబాబుకే చెల్లిందని ఈ సందర్భంగా సజ్జల ఎద్దేవా చేశారు.

చంద్రబాబు మెడికల్‌ రిపోర్టుపై ఎల్లో మీడియా హడావుడి చేస్తోందని సజ్జల మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు కోర్టును రిక్వెస్ట్‌ చేయొచ్చని, కోర్టు అనుమతిస్తే బెయిల్‌ వస్తుందని ఆయన చెప్పారు. ఆ కారణంతోనే చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్‌ వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ బెయిల్‌ పై మరికొంత కాలం బయట ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జైలులో ఉన్నంతసేపూ బాబుకు ప్రాణాంతక వ్యాధులున్నట్టు ప్రచారం చేశారని, బెయిల్‌ రాగానే ఆయన మాత్రం జైలు నుంచి ర్యాలీ పేరుతో హంగామా చేశారని గుర్తుచేశారు. మెడికల్‌ రిపోర్ట్‌ ఇచ్చింది వైద్యులా లేక రాజకీయ నేతలా? అని ఈ సందర్భంగా మరోసారి ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజంగా ఆ పరిస్థితి ఉంటే వెంటనే ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలన్నారు.

చంద్రబాబు జైలులో ఉన్నా బయట ఉన్నా తమకేమీ ఇబ్బంది లేదని సజ్జల స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కుంభకోణం జరిగిందన్న విషయం పక్కకి పోతోందని ఆయన చెప్పారు. ఈ స్కాం తాను చేయలేదని మాత్రం చంద్రబాబు చెప్పలేకపోతున్నారన్నారు. చంద్రబాబు తరపు లాయర్లు కూడా స్కాంపై వాదించడం లేదన్నారు. మేనిఫెస్టో గురించి తమను ప్రశ్నించే ముందు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుదేనని ఈ సందర్భంగా ఆయన ధ్వజమెత్తారు.

First Published:  17 Nov 2023 8:07 AM IST
Next Story