Telugu Global
Andhra Pradesh

సునీత వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్‌

సునీత ఈరోజు ముసుగు తీసేసిందని సజ్జల స్పష్టం చేశారు. ఆమె ఎవరి ప్రతినిధో ఇవాళ తెలిసిపోయిందని చెప్పారు. ఆమె ఎవరికి కృతజ్ఞతలు తెలిపారో చూస్తే అందరికీ విషయం అర్థమవుతుందన్నారు.

సునీత వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్‌
X

వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె సునీత తాజాగా చేసిన వ్యాఖ్యలకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. శుక్రవారం ఆయన సచివాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేనని చెప్పారు. అయినా ఈ కేసు గురించి సునీత ఆయన్ని ఎందుకు నిలదీయలేకపోయారని సజ్జల ప్రశ్నించారు. విజయమ్మను ఓడించడం కోసమే అప్పట్లో వివేకాను టీడీపీ దగ్గరకు తీసుకుందని ఆయన చెప్పారు. అసలు వివేకా ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం చంద్రబాబు, బీటెక్‌ రవి కాదా అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తులతో సునీత ఇప్పుడు ఎలా జట్టు కట్టారని ఆయన నిలదీశారు.

సునీత ఈరోజు ముసుగు తీసేసిందని సజ్జల స్పష్టం చేశారు. ఆమె ఎవరి ప్రతినిధో ఇవాళ తెలిసిపోయిందని చెప్పారు. ఆమె ఎవరికి కృతజ్ఞతలు తెలిపారో చూస్తే అందరికీ విషయం అర్థమవుతుందన్నారు. చంద్రబాబు చేతిలో సునీత ఓ పావులా మారారని సజ్జల తెలిపారు. వివేకా హత్య జరిగింది చంద్రబాబు హయాంలోనేనని, నాలుగైదు రోజుల్లో తేలిపోవాల్సిన కేసు అని సునీతే అంటున్నారని, మరి అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబును సునీత అడగాలి కదా.. తండ్రిని నరికిన వాడిని సునీత అక్కున చేర్చుకోలేదా అంటూ ఆయన నిలదీశారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనని విమర్శించారు. వివేకా కేసులో సునీత కుటుంబ సభ్యులపై కూడా అనుమానాలు ఉన్నాయని, విచారణ అన్నింటిపైనా జరుగుతుందని సజ్జల స్పష్టం చేశారు.

వైసీపీ అభ్యర్థులు గూండాలు, స్మగ్లర్లు అయితే.. తమ పార్టీ నుంచి వెళ్లిన వారిని చంద్రబాబు తన పార్టీలోకి ఎందుకు తీసుకుంటున్నాడని సజ్జల ప్రశ్నించారు. ఇక పవన్‌ విషయానికొస్తే.. ఆయన పొత్తులో భాగంగా తనకు ఇచ్చిన 24 సీట్లను 240 సీట్లు అనుకుంటున్నట్టున్నాడని చెప్పారు. తాడేపల్లిగూడెంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని సజ్జల తెలిపారు. తొలి సమావేశంతోనే టీడీపీ, జనసేన పొత్తు ఫెయిలైందని తేలిపోయిందని చెప్పారు. పవన్‌ అందరినీ మోసం చేశాడనే విషయం కాపు నాయకులకే అర్థమైపోయిందని వివరించారు. అసలు పోటీకే అభ్యర్థులు లేని పవన్‌ కల్యాణ్‌ ఎవరిని అథఃపాతాళానికి తొక్కుతాడని ఆయన ప్రశ్నించారు. పదేళ్ల కిందట పార్టీ పెట్టిన పవన్‌ అసలేం సాధించారడని ఈ సందర్భంగా సజ్జల నిలదీశారు.

First Published:  1 March 2024 3:19 PM IST
Next Story