Telugu Global
Andhra Pradesh

ఇసుక లేకుండా ఇళ్లు ఎలా కడతాం?.. చంద్రబాబుది విష ప్రచారం: సజ్జల

ఎప్పుడో 2018 లో జరిగిన ఘటనలకు సంబంధించిన ఫొటోలు.. ఇప్పుడు జరిగినట్టుగా చూపించారు.

ఇసుక లేకుండా ఇళ్లు ఎలా కడతాం?.. చంద్రబాబుది విష ప్రచారం: సజ్జల
X

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ఇసుక లేకుండా నిర్మాణాలు ఎలా చేపడుతుందని చెప్పారు. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ కార్యాలయంలో ఫొటో ఎగ్జిబిషన్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై సజ్జల ఘాటుగా స్పందించారు. చంద్రబాబు నాయుడు పాత ఫొటోలు తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.

గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. 'టీడీపీ మహానాడును చూసి చంద్రబాబు, ఆయనకు బాకాలు ఊదే మీడియా ఆహా.. ఓహో అంటూ ప్రశంసించాయి. ఆ తర్వాత వైసీపీకి ప్లీనరీకి ప్రజలు పోటెత్తడంతో చంద్రబాబుకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా వైసీపీ ఘన విజయం సాధిస్తోంది.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని తేలింది. దీంతో తప్పుడు ప్రచారం చేయాలని చంద్రబాబు పన్నాగం పన్నారు.

రాష్ట్రానికి అప్పు పుట్టకుండా.. సంక్షేమపథకాలు ఆగిపోయేలా కుట్రలు చేస్తున్నారు. న్యాయస్థానాలకు వెళ్లి.. కొన్ని కార్యక్రమాలను అడ్డుకున్నారు. తాజాగా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఫొటో ఎగ్జిబిషన్ అంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఎప్పుడో 2018 లో జరిగిన ఘటనలకు సంబంధించిన ఫొటోలు.. ఇప్పుడు జరిగినట్టుగా చూపించారు.

ఏ ప్రభుత్వం అయినా.. రోడ్లు వేయాలన్నా, నిర్మాణాలు చేపట్టాలన్న ఇసుక అవసరం అవుతుంది. ఇసుక తవ్వినా.. తప్పుడు ప్రచారం చేస్తే ఎలా. నిబంధనల ఆధారంగానే రుషికొండలో తవ్వకాలు చేపట్టాం. గత ప్రభుత్వ హయాంలోనే గనుల తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఉప్పెనలాగా ఓటర్లు పోటెత్తివచ్చి జగన్ కు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

నేడు టీడీపీ స్పీడ్‌ పెంచి మైనింగ్, మట్టి అంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. కొండలు తవ్వుతున్నారు. మట్టి కొట్టేస్తున్నారు. మైనింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ విష ప్రచారం చేస్తోంది. లేటరైట్‌ను భారతీ సిమెంట్‌కు సరఫరా చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు.. తన హయాంలో రోడ్లు వేసినా, బిల్డింగ్ కట్టాలన్నా సిమెంట్, ఇసుక, కంకర లేకుండా నిర్మాణాలు జరిగాయా? గత ప్రభుత్వాలు సిమెంట్ పరిశ్రమలకు లేటరైట్ ఇవ్వలేదా?' అని సజ్జల ప్రశ్నించారు.

First Published:  14 July 2022 8:10 PM IST
Next Story