పదేళ్లలో పవన్ అక్రమార్జన రూ.2 వేల కోట్లు
2014లో కేవలం ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటూ కారు ఈఎంఐ కూడా చెల్లించలేకపోతున్నానని చెప్పిన పవన్ ఇప్పుడు లగ్జరీ కార్లు, విలాసవంతమైన ఇల్లు, తిరగటానికి హెలికాప్టర్, అనేక ఆస్తులను తొమ్మిదేళ్లలో ఎలా సంపాదించారో చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.
తనను నమ్ముకున్న జనసేన పార్టీ నేతలను రాజకీయంగా, ఆర్థికంగా బలిపశువులను చేసి పవన్ కల్యాణ్ మాత్రం వేల కోట్లు అక్రమంగా ఆర్జించాడని వైసీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు. గత పదేళ్ల కాలంలో పవన్ కల్యాణ్ అక్రమార్జన రూ.1500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు ఉందని ఆయన వెల్లడించారు. ప్రజారాజ్యం పార్టీని నడపలేక తీసేశారు గానీ.. జనసేన పార్టీని మాత్రం ముందే చంద్రబాబుకి అమ్మేసి డబ్బులు తెచ్చుకున్న దుర్మార్గుడు పవన్ అని ఆయన మండిపడ్డారు. కాపులను పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి, బీసీలను మార్పు కోసం పోరాడాలని సూచించి ఆయన మాత్రం చంద్రబాబుకు పాలేరు పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
2014లో కేవలం ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటూ కారు ఈఎంఐ కూడా చెల్లించలేకపోతున్నానని చెప్పిన పవన్ ఇప్పుడు లగ్జరీ కార్లు, విలాసవంతమైన ఇల్లు, తిరగటానికి హెలికాప్టర్, అనేక ఆస్తులను తొమ్మిదేళ్లలో ఎలా సంపాదించారో చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ముందు నుంచే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను, నేను చంద్రబాబు సేవకుణ్ణి, చంద్రబాబు పాలేరుని అంటూ ప్యాకేజీ తీసుకుని తనలాంటి వాళ్లను పవన్ బలి పశువులని చేసి ఆయన మాత్రం ఆర్థికంగా బాగా బలపడ్డారని ఆయన విమర్శించారు.
పవన్ అక్రమాస్తుల వివరాలివీ..
ఈ సమావేశంలో పవన్ ఆక్రమాస్తులు.. బినామీల పేర్లతో కొనుగోలు చేసిన వాటి వివరాలను పోతిన మహేష్ వెల్లడించారు.
– మంగళగిరి పార్టీ ఆఫీస్ పక్కన పవన్ బినామీ అయినా నర్రా శ్రీనివాస్ మిత్రుడు పోషడుపు వెంకటేశ్వరరావు పేరు మీద రూ.100 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి ఆధార్ కార్డుపై అనేక అనుమానాలున్నాయి. పోషడుపు వెంకటేశ్వరరావు గుంటూరు అయితే చెల్లించిన బ్యాంకు చెల్లింపులు హైదరాబాద్‌లోని ఐసీఐసీఐ బ్యాంకువి. వీటిపై సమాధానం చెప్పాలి. రెండు రిజిస్ట్రేషన్లకి పోషడుపు వెంకటేశ్వరరావు హాజరుకాగా.. మరొక రెండు రిజిస్ట్రేషన్లకు నర్రా శ్రీనివాస్ కారు డ్రైవర్ వి.నవీన్ కుమార్ హాజరయ్యాడు. డాక్యుమెంట్ నెంబర్లు 704/2024, 2244/2024, 2818/2024, 3555/2024, 5002/2014.
– రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో పవన్ ఫామ్ హౌస్ 14 ఎకరాల్లో ఉందని అఫిడవిట్‌లో చూపించారు. కానీ, అది 45 నుంచి 50 ఎకరాల్లో ఉంది. పాతది 14 ఎకరాలైతే.. 2019 ఎన్నికల తర్వాత పవన్ మరొక 30 ఎకరాలు కొనుగోలు చేశారు. ఒక్కో ఎకరం ఏడున్నర కోట్లు అంటే సుమారు రూ.250 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారు. ఆది కూడా బినామీ పేర్ల మీద పెట్టారు.
– పవన్‌కు ఎన్‌ఆర్‌ఐలు, కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది పెద్దలు 2019 ఎన్నికల్లో రూ.125 కోట్ల విరాళాలిచ్చారు. వాటిని వసూలు చేసింది పీవీ రావు, ఆర్‌ఆర్ రామ్మోహన్, చింతల పార్థసారథి, ముత్తంశెట్టి కృష్ణారావు. అందులో 90 శాతం నగదు రూపంలో, పది శాతం డీడీల రూపంలో ఇచ్చారు. ఆ డబ్బుల వివరాలు అడిగినందునే వాళ్ల మధ్య వివాదాలు తలెత్తాయి. పవన్ నిజస్వరూపం తెలియాలంటే 2018 నుంచి 2024 వరకు చిరంజీవి, ఆయన కుమారుడు రామ్‌చరణ్ తప్ప పవన్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలన్నీ బయటపెట్టాలి.
– పవన్ హైదరాబాదులో కొనుగోలు చేసిన 4,200 గజాల విలువ రూ.50 కోట్లుగా చూపించారు. దానిని 2021–2024 మధ్యే కొనుగోలు చేశారు. నిజానికి.. దాని విలువ సుమారు రూ.125 కోట్లుగా ఉంది. మిగిలిన రూ.75 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. సినిమాలు లేకుండా ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి.
– పవన్ బ్యాంకుల్లో ఫిక్సెడ్ డిపాజిట్ల కింద రూ.28 కోట్లు ఉన్నాయని చూపించారు. కానీ, బయట వ్యక్తుల దగ్గర రూ.46 కోట్ల అప్పులను కూడా చూపించారు. బ్యాంకులో రూ.28 కోట్లు ఉండగా ఎక్కువ వడ్డీకి ఎవరైనా బయట నుంచి అప్పు తెచ్చుకుంటారా? సినీ పరిశ్రమలోను, బయట పవన్ బినామీలున్నారు. వారిలో ప్రధానంగా నర్రా శ్రీనివాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్. వీరితోపాటు అమెరికాలోని పవన్ పిన్ని కొడుకు అనిల్, అలాగే.. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, తంగెళ్ల సుమన్ వీరంతా కూడా ఆయన బినామీలే.
– ఇక పవన్ కొనుగోలు చేసిన ఆస్తులు కాకుండా అనేక ఆస్తులు అగ్రిమెంట్ మీద స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఎన్నికల తర్వాత కొన్ని సినిమా అడ్వాన్సుల కింద తీసుకున్నట్లు చూపించి ఆపై రిజిస్ట్రేషన్ చేయించుకోనున్నారు.
– హైదరాబాద్‌లో ఆంధ్రజ్యోతి కార్యాలయం వెనుక నాలుగు నెలల కిందటి వరకు జనసేన కార్యాలయంగా ఉన్న స్థలం సొంత కార్యాలయంగా మారిపోయింది.
– టీ టైమ్ తంగెళ్ల శ్రీనివాస్‌కు 2,500 టీ దుకాణాలు ఉన్నాయి. పవన్ తన బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు ఈ దుకాణాలను మార్గంగా ఎంచుకున్నారు. పవన్ తన పిల్లల పేరు మీద ఉన్న ఫిక్సెడ్ డిపాజిట్లు రద్దుచేశానని చెప్పారు గానీ.. ఎప్పుడు ఏ బ్యాంకులో ఎంత మొత్తానివి రద్దుచేసి ఏ ఆస్తి కొన్నారో చెప్పాలి.
– జనసేన కార్యాలయాల కోసం కొనుగోలు చేస్తున్న స్థలాలన్నీ కూడా పవన్ పేరు మీద ఎందుకు పెట్టాలి? పార్టీ పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించడం లేదు?
– ప్యాకేజ్ ద్వారా తీసుకున్న డబ్బుల్ని ఫ్లోరిడాలో పెట్టుబడులు పెట్టేందుకే పవన్ విరాళాల ముసుగులో అమెరికాకు వెళ్తున్నారు.
– త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి బెంగళూరులో కమర్షియల్ కాంప్లెక్స్ కొనుగోలు చేయడానికి పవన్ యత్నిస్తున్నారు. హాసిని ప్రొడక్షన్స్ ద్వారా ఈ డబ్బులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు.
– పవన్‌తో తీసిన సినిమాలు ఫ్లాప్ అయినా, డబ్బులు రాకపోయినా నిర్మాత విశ్వప్రసాద్ పవన్‌తో ఏడు సినిమాలు తీస్తానని చెబుతున్నారు. ఈ చిదంబర రహస్యం ఏంటి?
– పవన్ ప్రధాన బినామీ టీజీ విశ్వప్రసాద్‌పై సీబీఐ విచారణ చేయాలి. ఈడీ, సీఐడీలు కేసులు నమోదు చేయాలి.
– రేణుదేశాయ్‌కి ప్రతినెలా రూ.10 లక్షలు టీజీ విశ్వప్రసాద్ తీసుకెళ్లి ఇస్తున్నారు.
– ప్యాకేజీకి అదనంగా పవన్ కళ్యాణ్ సీట్లు అమ్ముకున్న మాట ముమ్మాటికీ నిజం. జనసేన టికెట్లను తెలుగుదేశం వాళ్లకు ఇచ్చినందుకు ఒక్కో టికెట్‌కు రూ.10 కోట్లు పవన్ వసూలు చేశారు.
వీటన్నింటిపై పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా పోతిన మహేష్ డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత ఆస్తుల పెంపు కోసం పార్టీని, పార్టీని నమ్ముకున్న తనలాంటి నాయకులు, కేడర్‌ని ఉపయోగించుకున్నాడని ఆయన మండిపడ్డారు.