Telugu Global
Andhra Pradesh

గురివింద మాట‌లొద్దు- బీజేపీకి వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్

అమరావతిలో భూకుంభకోణాలు జరిగాయి వాటిపై విచారణ జరిపిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ, కర్నూలులో హైకోర్టు పెడుతామని చెప్పిన బీజేపీ ఇప్పుడు మాత్రం అమరావతికి మద్దతు ఇస్తామని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు.

గురివింద మాట‌లొద్దు- బీజేపీకి వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్
X

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మాజీ మంత్రి పేర్నినాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ జేపీ నడ్డా ఏపీ పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. కర్నాటకలో కుక్క చావు చచ్చిన తర్వాత ఏపీకి వచ్చి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మర్యాదగా మాట్లాడితే బాగుంటుందని అలా కాకుండా మర్యాద మీరితే తాము అంతకు రెట్టింపుగా సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. మనువు బీజేపీతో మనసు చంద్రబాబుతో ఉంటే సీఎం రమేష్, సుజనా చౌదరి, సత్యకుమార్‌ లాంటి వ్యక్తులు చెప్పిన మాటలను బుర్రకు ఎక్కించుకుని మాట్లాడితే అది మీకే మంచిది కాదని కామెంట్స్ చేశారు.

అమరావతిలో భూకుంభకోణాలు జరిగాయి వాటిపై విచారణ జరిపిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ, కర్నూలులో హైకోర్టు పెడుతామని చెప్పిన బీజేపీ ఇప్పుడు మాత్రం అమరావతికి మద్దతు ఇస్తామని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఇప్పుడే టీడీపీ రాగం ఎందుకు అందుకున్నారో అయోధ్య రాముడికే తెలియాలన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ పువ్వులన్నీ ఏం మాట్లాడాయో గుర్తు లేదా అని నిలదీశారు. అమరావతి నిర్మాణానికి డబ్బులు ఇస్తే చంద్రబాబు మింగేశారని చెప్పలేదా అని ప్రశ్నించారు.

2014 నుంచి 2019 వరకు టీడీపీ, బీజేపీ కలిసి పాలన చేశాయని ఆ సమయంలో ఇసుక ఫ్రీ అంటూ దోచుకున్నారని ఆరోపించారు. అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకను ప్రభుత్వం ద్వారా విక్రయించడం వ‌ల్ల ఐదేళ్లలో 4వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తోందన్నారు. ఈ వేల కోట్లు గతంలో ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. ఫ్రీ అన్నా సరే టీడీపీ హయంలో లారీకి 30వేల వసూలు చేశారన్నారు.

టీడీపీ హయాంలో మూడు నాలుగు కంపెనీలకే 80 శాతం లిక్కర్ బిజినెస్‌ను అప్పగించి కుంభకోణాలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ వాటా ఎంతో జేపీ నడ్డా చెప్పాలన్నారు. ఏపీలో ల్యాండ్ స్కాం అని మాట్లాడుతున్నారని అసలు కుంభకోణం అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ భూములపై కన్నేయడమేనన్నారు. విశాఖ స్టీల్ పీక కోసి ఆ భూములు దోచేయడానికి ప్లాన్‌ చేశారని, దాన్ని భూ కుంభకోణం అంటారన్నారు.

ఢిల్లీలో విపక్షాలన్నీ కేంద్రంపై అనేక ఆరోపణలు చేస్తున్నాయని.. చేతనైతే జేపీ నడ్డా ఢిల్లీలో కూర్చుని వాటికి సమాధానం చెప్పాలన్నారు. చెప్పుడు మాటలు విని మాట్లాడడం మానుకుంటే ఆరోగ్యానికి మంచిదన్నారు. అవినీతి ప్రభుత్వం అంటే ఏంటో కర్నాటకలో ప్రజలంతా చూశారన్నారు. దక్షిణాదిలో అవినీతి ప్రభుత్వం అంటూ కర్నాటకలో ప్రజలు ఊసింది మిమ్మల్ని కాదా అని ప్రశ్నించారు. ఏపీ బీజేపీ మొత్తం ఇప్పుడు పచ్చపువ్వులతో నిండిపోయిందన్నారు. బీజేపీ కాస్త ఇప్పుడు టీజేపీగా మారిపోయిందన్నారు.

ఒక చోట గవర్నమెంట్ పోగానే అప్పటి వరకు తాము చెప్పిన తప్పుడు పనులన్నీ చేసిన అధికారిని ఎక్కడికి తీసుకెళ్లి పెట్టుకున్నారో అందరికీ తెలుసన్నారు. ఒక సీబీఐ డైరెక్టర్ కోసం ఇంగ్లీష్ సినిమాల్లో చూపినట్టు హెలికాప్టర్లు దింపి తీసుకెళ్లినంత పని ఎవరో చేశారో అందరికీ తెలుసంటూ మాట్లాడారు. లా అండ్ ఆర్టర్‌ గురించి మాట్లాడుతున్నా జేపీ నడ్డా బీజేపీ నాయకత్వంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో తెలియదా అని ప్రశ్నించారు. యూపీలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసన్నారు. అక్కడ చక్కబెట్టుకోకుండా ఇక్కడికి వచ్చి ముత్తైదువా మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

First Published:  11 Jun 2023 5:36 PM IST
Next Story