బాబొస్తే వచ్చేది రామరాజ్యం కాదు.. రాక్షస రాజ్యం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాలనే తానూ అమలు చేస్తానంటున్న చంద్రబాబు మనకు అవసరమా అని ముద్రగడ ప్రజలను ప్రశ్నించారు.

చంద్రబాబుపై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకొస్తే రామరాజ్యం వస్తుందని చెబుతున్న చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకొస్తే వచ్చేది రామ రాజ్యం కాదని, రాక్షస రాజ్యమని అన్నారు. 1988లో ప్రజలు చంద్రబాబు రామరాజ్యం ఏంటనేది చూశారని ఆయన తెలిపారు. 2016లో తాను చంద్రబాబు రావణ రాజ్యాన్ని స్వయంగా చూశానని ఆయన చెప్పారు. అప్పట్లో కిర్లంపూడిని పాకిస్తాన్ చేశాడని ఆయన తెలిపారు. ఎవరైనా కిర్లంపూడి రావాలంటే పాస్‌పోర్టు ఉండాలి, వీసా ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి.. ఇంకా ముఖ్యమైనది కుల సర్టిఫికెట్ ఉండాలి.. అలా రావణ రాజ్య పాలన చేసిన చంద్రబాబుకు మళ్లీ అధికారం కట్టబెట్టాలంట.. అంటూ ఆయన మండిపడ్డారు. నాలుగు సంవత్సరాల పాటు నరకం చూశామన్నారు.
కాకినాడలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు చెప్పి అర్జంటుగా అధికార పీఠంపై కూర్చోవాలని చంద్రబాబు ఆరాటపడుతున్నాడని ముద్రగడ చెప్పారు. చంద్రబాబు కడుపులో అధికార ఆకలి దహించుకుపోతోందని ఆయన తెలిపారు. ఓటర్లు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అబద్ధాలు చెప్పేవాడికి లొంగిపోతే పేదవాడికి ఆక్సిజన్ కూడా దొరకదని ఆయన చెప్పారు. పేదవాడి ఆక్సిజన్.. సీఎం జగన్ అని ముద్రగడ తెలిపారు. ఆ ఆక్సిజన్‌ను కాపాడుకోవాలని ప్రజలను కోరుతున్నానని ముద్రగడ విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాలనే తానూ అమలు చేస్తానంటున్న చంద్రబాబు మనకు అవసరమా అని ముద్రగడ ప్రజలను ప్రశ్నించారు. దారుణమైన పాలన చేసిన చంద్రబాబును తాను వదలనని, భగవంతుడు వేసిన శిక్ష చంద్రబాబు ఇంకా అనుభవించాలని ఆయన స్పష్టం చేశారు. మమ్మల్ని తన్నించడం, మంగళసూత్రం తెంపించడం, జుట్టు మెలితిప్పడం.. నడుం మీద ఆడవారితో తన్నించడం.. పిల్లలను లాఠీలతో కొట్టించడం.. వంటి అరాచకాలన్నీ చేశారని చెప్పారు. అలాంటి వ్యక్తికి భగవంతుడు పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకున్నానని తెలిపారు. కోరుకున్నట్టే భగవంతుడు చంద్రబాబుకు పనిష్మెంట్ ఇచ్చాడని, అది ఇంకా కొనసాగాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. పొరపాటున చంద్రబాబు అధికారంలోకొచ్చాడా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తాడని హెచ్చరించారు. ప్రజలు ఆలోచన చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.