Telugu Global
Andhra Pradesh

నా కుటుంబంపై దాడులు జరిగితే పవన్‌ ఏనాడూ స్పందించలేదు

దుర్మార్గుడైన చంద్రబాబును చూడటానికి పవన్‌ కల్యాణ్‌ జైలుకు వెళ్లాడని ముద్రగడ చెప్పారు. కాపు ఉద్యమంలో తన కుటుంబాన్ని హింసిస్తుంటే ఒక్కరోజు కూడా పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబును ప్రశ్నించలేదని తెలిపారు.

నా కుటుంబంపై దాడులు జరిగితే పవన్‌ ఏనాడూ స్పందించలేదు
X

కాపు ఉద్యమాన్ని అణచివేసిన వ్యక్తితో నేడు పవన్‌ కల్యాణ్‌ చేతులు కలిపాడని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో శుక్రవారం నిర్వహించిన కాపు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పవన్‌ తీరుపై విమర్శలు గుప్పించారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి డబ్బు సంపాదన కోసం వచ్చావా పవన్‌ అంటూ నిలదీశారు. చంద్రబాబు హయాంలో తన భార్యా పిల్లలపై దాడులు, అరెస్టులు జరిగితే పవన్‌ కల్యాణ్‌ ఏనాడూ స్పందించలేదని ఆయన తెలిపారు.

అధికార దాహంతో బాబు కుట్రలు చేస్తున్నాడు..

చంద్రబాబు అధికార దాహంతో ఉన్నాడని, ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కుట్రలు చేస్తున్నాడని ముద్రగడ పద్మనాభం చెప్పారు. కాపు ఉద్యమ సమయంలో ఘోరాతి ఘోరమైన అవమానాలను కాపులకు చంద్రబాబు చేయించాడని ఆయన మండిపడ్డారు. తనను, తన భార్య, పిల్లలు, కోడలిని జైలులో మాదిరిగా 14 రోజుల పాటు బంధించారని చెప్పారు. తమకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదని, దీంతో వాష్‌ బేషిన్‌లో నీళ్లు తాగామని ఆవేదన వ్యక్తం చేశారు.

పవన్‌ ఒక్కసారి కూడా బాబును ప్రశ్నించలేదు..

అంతటి దుర్మార్గుడైన చంద్రబాబును చూడటానికి పవన్‌ కల్యాణ్‌ జైలుకు వెళ్లాడని ముద్రగడ చెప్పారు. కాపు ఉద్యమంలో తన కుటుంబాన్ని హింసిస్తుంటే ఒక్కరోజు కూడా పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబును ప్రశ్నించలేదని తెలిపారు. తాను జగన్‌ పిలుపు మేరకు ఇప్పుడు వైసీపీలో చేరితే.. తనను అసభ్య పదజాలంతో తిట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లను నేను ఫాలో అవ్వాలా.. ఎందుకు అవ్వాలి.. అంటూ ముద్రగడ ప్రశ్నించారు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావని నేను నీ దగ్గరికి రావాలి అంటూ నిలదీశారు. నీకో ఎమ్మెల్యే అయినా ఉన్నాడా అని ప్రశ్నించారు. కనీసం ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్నావా? అని నిలదీశారు. పవన్‌.. నువ్వు సినిమాల్లో మాత్రమే హీరోవి.. రాజకీయాల్లో కాదు.. అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కాపులు అందరూ వైసీపీ ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసేలా సిద్ధం కావాలని ఆయన కోరారు.

First Published:  26 April 2024 4:32 PM IST
Next Story