వసంత వ్యాఖ్యల కలకలం.. కొడాలి స్ట్రాంగ్ రియాక్షన్
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 105 కులాల్లో 10 లేదా 12 కులాలకే మంత్రి వర్గంలో ప్రాధాన్యం ఉంటుందన్నారు కొడాలి నాని. ఇప్పటివరకు 90 బీసీ కులాల్లో ఎంతమందికి ఏపీలో మంత్రి పదవులు దక్కాయని ప్రశ్నించారు.
మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు ఇటీవల ఏపీ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలను అంత సీరియస్ గా ఎవరూ పట్టించుకోకపోయినా, ప్రస్తుతం ఆయన తనయుడు వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే. దీంతో ఆయన వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ గా మారాయి. రాజధాని విషయంలో ఆయన ప్రభుత్వంతో విభేదించారు. ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్పుని తీవ్రంగా ఖండించారు, వైసీపీలోని కమ్మ నాయకులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత ఏపీ కేబినెట్ లో అసలు కమ్మ మంత్రులే లేరని, ఇంకెంతకాలం ఈ బానిసత్వం.. అంటూ కలకలం రేపారు. దీంతో వెంటనే వైసీపీ నేతలు నష్టనివారణ చర్యలు చేపట్టారు. వసంత కృష్ణప్రసాద్, తన తండ్రి చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. వాగే నోరు, తిరిగే కాలు ఆగదన్నట్లుగా తన తండ్రిని ఎవరూ ఆపలేమని, తన తండ్రి నోరు చాలా ప్రమాదకరమని అన్నారు. ఎప్పుడూ ఎవరో ఒకరిని ఇరకాటంలో పెట్టడం ఆయన నైజమని పేర్కొన్నారు.
కొడాలి నాని రియాక్షన్..
వసంత కృష్ణప్రసాద్ ఒక్కరే ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తే సరిపోదని అనుకున్నారేమో, ఇప్పుడు వైసీపీ కమ్మ నాయకులు రంగంలోకి దిగారు. జగన్ తొలి కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకుని, ఇప్పుడు మాజీగా మారిన కమ్మ నేత కొడాలి నాని వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ప్రాధాన్యత ప్రకారమే ఏ వర్గానికైనా పదవులొస్తాయని, ఆ మాటకొస్తే టీడీపీ హయాంలో మైనార్టీ, ఎస్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 105 కులాల్లో 10 లేదా 12 కులాలకే మంత్రి వర్గంలో ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఇప్పటివరకు 90 బీసీ కులాల్లో ఎంతమందికి మంత్రి పదవులు దక్కాయో చెప్పాలన్నారు నాని. ఎన్టీఆర్ ని కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా పరిమితం చేయొద్దన్నారు.
వాస్తవానికి జగన్ రెండో కేబినెట్ లో కమ్మ నేతలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. కానీ ఎవరూ బయటపడలేదు, ఇప్పుడు వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరోసారి హైలెట్ అయింది. పోనీ అంబేద్కర్ ఆశయాలకోసమే జగన్ సామాజిక న్యాయం పాటించినా, రెడ్డి సామాజిక వర్గానికి రెండోసారి కూడా మంత్రి పదవులిచ్చి, కమ్మ సామాజిక వర్గాన్ని మాత్రమే పక్కనపెట్టారనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది.