కర్నాటక నుంచి కొట్టుకొచ్చారు- టీడీపీ మినీ మేనిఫెస్టోపై కొడాలి ఫైర్
2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణమాఫీ, రైతుల రుణాలు మొత్తం మాఫీ, బెల్ట్ షాపులన్నీ రద్దు హామీ ఇచ్చి వాటిని అమలు చేశారా..? అని టీడీపీని కొడాలి నాని నిలదీశారు. ప్రతి సంక్షేమ పథకాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.
టీడీపీ మినీ మేనిఫెస్టోపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. మహానాడు జరిగిన తీరుపైనా విమర్శలు చేశారు. చెత్తనా కొడుకులందరినీ తీసుకొచ్చి చంద్రబాబు పొగిడించుకున్నారని విమర్శించారు. టీడీపీ నేతలంతా ఎన్టీఆర్ గురించి ఒక నిమిషం మాట్లాడి మిగిలిన సమయమంతా జగన్‌ను నోటికొచ్చినట్టు తిట్టడానికే కేటాయించారన్నారు.
మహానాడు వేదిక మీద చంద్రబాబు, లోకేష్ బొమ్మలు మాత్రమే ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ వారసుల బొమ్మలను ఎందుకు పెట్టలేదని కొడాలి నిలదీశారు. ఎన్టీఆర్ తెచ్చిన పథకాలను ఎత్తివేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ప్రతి ఎన్నికల్లోనూ తప్పుడు మేనిఫెస్టో విడుదల చేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోలను తీసుకురావాలని, తాము కూడా వైఎస్‌ఆర్ హయాంలో విడుదల చేసిన మేనిఫెస్టోను, జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోను తెస్తామని.. ఎవరు ఎంత మేరకు మాట నిలుపుకున్నారో బహిరంగంగా చర్చిద్దామని చంద్రబాబుకు సవాల్ విసిరారు.
2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణమాఫీ, రైతుల రుణాలు మొత్తం మాఫీ, బెల్ట్ షాపులన్నీ రద్దు హామీ ఇచ్చి వాటిని అమలు చేశారా..? అని టీడీపీని కొడాలి నాని నిలదీశారు. ప్రతి సంక్షేమ పథకాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. పేదలను ధనికులుగా మారుస్తా అంటున్న చంద్రబాబు.. 14ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎవరి చంక నాకారని ప్రశ్నించారు. చంద్రబాబు తన మేనిఫెస్టోను ఈసారి కర్నాటక నుంచి కాపీ కొట్టారని కొడాలి ఎద్దేవా చేశారు. మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నది బీజేపీ హామీ అని దాన్ని పట్టుకొచ్చిన చంద్రబాబు.. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, నెలకు 15వందలు మహిళలకు ఇస్తాం అన్నది కర్నాటకలో కాంగ్రెస్ హామీ అని గుర్తు చేశారు.
2003లో తిరుపతిలో మహానాడు పెట్టారని, అప్పుడు గాలివానకు అంతా కూలిపోయాయని.. అప్పుడు ఎన్టీఆర్, వెంకటేశ్వరస్వామి దీవించారని చంద్రబాబు చెప్పారని, అప్పుడు పిచ్చోళ్లం తామంతా నమ్మేశామన్నారు. కానీ ఆశీర్వాదం కాదు ఏడాది ముందే ఎన్టీఆర్, వెంకటేశ్వరస్వామి టీడీపీని ఎత్తిపడేశారని 2004 ఎన్నికల తర్వాత తమకు అర్థమైందన్నారు. నిన్న వేసవి కాలం అయినప్పటికీ రాజమండ్రిలో గాలి వాన వచ్చి ఫ్లెక్సీలన్నీ నేలకొరిగాయని, నిన్న కూడా ఎన్టీఆర్ ఆశీర్వాదమేనని చంద్రబాబు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆశీర్వాదం అంటే చంద్రబాబు కటౌట్లు వెళ్లి మురికి కాలువలో పడటమా అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు బాగుపడుతారని వీరంతా బీసీలా అని ప్రశ్నించారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో బీసీలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు. వైఎస్‌ఆర్, జగన్ కలిసి కేవలం బీసీల్లోని పేదలకే 40 లక్షల ఇళ్లను నిర్మించారన్నారు.
మహానాడుకు జూ.ఎన్టీఆర్ రాలేదని సోషల్ మీడియాలో ఇష్టానుసారం తిట్టిస్తున్నారన్నారు. చంద్రబాబు చేస్తున్నది క్యాష్ వార్ అని విమర్శించారు. చంద్రబాబు, ఆయన మనుషుల కంపెనీలన్నీ లాస్‌లోకి వెళ్లిపోయాయని తిరిగి అధికారంలోకి వస్తే లాభాలు వస్తాయనే చంద్రబాబు క్యాష్ వార్ మొదలుపెట్టారని కొడాలి నాని అన్నారు.