టిడిపిలో చేరిన గుదిబండి గోవర్థన్‌రెడ్డి
కాంగ్రెస్‌లో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అయిన దివంగత గుదిబండి వెంకటరెడ్డి సోదరుడి కుమారుడైన గుదిబండి గోవర్థన్‌రెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఎక్కడైనా అధికార పార్టీలోకి ఇతర పార్టీల నుంచి చేరికలు వుంటాయి. కానీ ఏపీలో విభిన్నంగా ప్రభుత్వంలో వున్న వైసీపీ నేత ప్రతిపక్ష టిడిపిలో చేరడం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌లో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అయిన దివంగత గుదిబండి వెంకటరెడ్డి సోదరుడి కుమారుడైన గుదిబండి గోవర్థన్‌రెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
తెనాలి నుంచి భారీసంఖ్యలో తన అనుచరులతో మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయానికి చేరుకుని ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఒకప్పటి దుగ్గిరాల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన గుదిబండి వెంకటరెడ్డి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులు. దుగ్గిరాల నియోజకవర్గం రద్దయిన తరువాత గుదిబండి వెంకటరెడ్డి పోటీ చేయలేదు. అనంతర కాలంలో వైసీపీతో గుదిబండి ఫ్యామిలీ కొనసాగింది. 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్ ప్రయత్నించిన గుదిబండి గోవర్థన్‌రెడ్డి, సీటుని అన్నాబత్తుని శివకుమార్‌కి పార్టీ కేటాయించడంతో ఆయన గెలుపు కోసం పనిచేశారు. ఆ తరువాత కాలంలో గుదిబండికి పార్టీలో ప్రాధాన్యత తగ్గింది. స్థానిక ఎమ్మెల్యేతో గ్యాప్ పెరిగింది. ఈ నేపథ్యంలో గోవర్థన్‌రెడ్డి టిడిపిలో చేరారని సమాచారం. రెడ్డి సామాజికవర్గం ఓట్లు గణనీయంగా వున్న కొల్లిపర మండలంలో గుదిబండి ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది.