Telugu Global
Andhra Pradesh

దోచుకోవడానికి వస్తున్నారు.. మైలవరంలో నాన్ లోకల్ లొల్లి

దేవినేని ఉమా, వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరు కూడా మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని రమేష్ బాబు ఆరోపించారు.

దోచుకోవడానికి వస్తున్నారు.. మైలవరంలో నాన్ లోకల్ లొల్లి
X

మైలవరం నియోజకవర్గంలో వైసీపీకి మరో కొత్త తలనొప్పి మొదలైంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్ బాబు లోకల్, నాన్ లోకల్ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్, టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న దేవినేని ఉమా ఇద్దరూ కూడా పక్కనే ఉన్న నందిగామ నియోజకవర్గానికి చెందినవారు.

పక్క నియోజకవర్గం నుంచి వచ్చి మైలవరం నియోజకవర్గంలో పెత్త‌నం చెలాయించడంపై స్థానిక నాయకులు చాలా కాలంగా గుర్రుగా ఉన్నారు. ఏకంగా నాన్ లోకల్ నాయకులు మాకు వద్దు అంటూ ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. నందిగామ రాజకీయాలను మైలవరం నియోజకవర్గంలోకి తెచ్చి లేని వివాదాలు సృష్టిస్తున్నారని రమేష్ బాబు ఆరోపించారు.

"మన మైలవరం- మన నాయకత్వం" పేరుతో ఒక బ్రోచర్ ను విడుదల చేశారాయన. దేవినేని ఉమా, వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరు కూడా మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని రమేష్ బాబు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో స్థానిక నాయకులకే టికెట్ ఇవ్వాలి.. ప్రజలు కూడా స్థానిక నాయకుల్ని గెలిపించుకోవాలి అన్న నినాదంతో తాను ప్రజల్లోకి వెళ్తానని రమేష్ బాబు చెబుతున్నారు.

రెండు దశాబ్దాలుగా మైలవరం నియోజకవర్గం నుంచి స్థానికేతర నాయకులే పోటీ చేస్తున్నారని.. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగడం లేదన్నారు. కృష్ణాజిల్లాలో మరే నియోజకవర్గంలో లేని విధంగా మైలవరం నియోజకవర్గంలో అనేక ఆర్థిక వనరులు ఉన్నాయని, అందుకే స్థానికేతర నాయకులు ఈ నియోజకవర్గ నుంచి పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారని రమేష్ బాబు ఆరోపించారు.

పక్కనే కృష్ణా నది ఉండటం, భారీగా మట్టిని తవ్వుకునేందుకు కొండలు ఉండటంతో ఇక్కడికి నేతలు వలస వస్తున్నారని వివరించారు. మండల స్థాయిలో స్థానికేతర నాయకుల్ని నియమించుకొని వారిద్వారా ఇసుక తరలింపు, మట్టి తరలింపు చేస్తూ కోట్ల రూపాయల సంపాదిస్తున్నారని ఆయన ఆరోపించారు. అదే స్థానిక నాయకులు ఎవరైనా చిన్న వ్యాపారం చేసుకోవాలన్నా.. వారికి వాటాలు ఇవ్వాల్సి వస్తోందన్నారు. మైలవరం నియోజకవర్గంలో భారీగా మట్టిని తవ్వుతూ జిల్లాలోని పలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారని ఇలా చేయడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ఆరోపించారు. దేవినేని ఉమా మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ, నందిగామకు చెందిన వ్యక్తుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ మండలానికి ఒకరిని నియమించుకుని దోపిడీ చేశారని, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా అదే పని చేస్తున్నారని ఆరోపించారు.

పార్టీ నాయకత్వం ఆదేశించింది కదా అని స్థానికేతర నాయకులైనప్పటికీ తాము కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఆ తరువాత నందిగామ నియోజకవర్గానికి చెందిన తమ సొంత వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడి మట్టి, ఇసుకను తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. మైలవరంలోని స్థానిక నాయకులు పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన వ్యక్తుల దయాదాక్షిణ్యాల మీద బతకాల్సి వస్తోందని, ఇలాంటి బానిస బతుకులు మైలవరం నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు వద్దని రమేష్ బాబు పిలుపునిచ్చారు.

అసలు పొరుగింటి వాడు వచ్చి మన ఇంట్లో పెత్తనం చేస్తే.. చూస్తూ ఊరుకుంటామా అని ప్రజల్ని ప్రశ్నించారు. పక్క నియోజకవర్గాల నాయకులు ఇక్కడికి వచ్చి మైలవరం నియోజకవర్గాన్ని అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారని ఆవేదన చెందారు. పుట్టి పెరిగిన సొంత నియోజకవర్గం కాకపోవడంతో మైలవరం అభివృద్ధి విషయంలో ఈ వలస నాయకులకు ఎలాంటి పట్టింపులు కూడా లేవని జ్యేష్ట రమేష్ బాబు ఫైరయ్యారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మైలవరంలో స్థానిక నాయకులకే అవకాశం ఇవ్వాలని రమేష్ బాబు డిమాండ్ చేశారు.

First Published:  11 Jan 2023 5:54 PM IST
Next Story