Telugu Global
Andhra Pradesh

కేశినేని నానిపై వైసీపీ కన్ను.. విజయవాడలో టీడీపీ మల్లగుల్లాలు

విజయవాడలో కేశినేని నానీని రాబోవు ఎన్నికల్లో పక్కన పెట్టాలనే ఉద్దేశంలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతని సోదరుడు కేశినేని శివనాథ్‌కి టీడీపీ నేతలు మద్దతుగా నిలుస్తూ ఎంకరేజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కేశినేని నానిపై వైసీపీ కన్ను.. విజయవాడలో టీడీపీ మల్లగుల్లాలు
X

విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి ఇప్పుడు టీడీపీకి కొత్త తలనొప్పిగా మారిపోయింది. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుతో కలిసి నందిగామ నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేశినేని నాని.. ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న దశలో ఇలా వైసీపీ ఎమ్మెల్యేని పొగడటంపై అక్కడి టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున కేశినేని నాని పోటీచేయడం లేదనే ప్రచారం కూడా విజయవాడలో మొదలైంది.

వాస్తవానికి నందిగామలో 2019 ఎన్నికల్లో కేవలం 10,881 మెజార్టీతో వైసీపీ అభ్యర్థి జగన్మోహన్ రావు విజయం సాధించారు. అప్పట్లో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య గట్టి పోటీనిచ్చారు. ఆమెకి 76,612 ఓట్లు పోల‌వ్వ‌గా.. జగన్మోహన్‌ రావుకు 87,493 ఓట్లు పడ్డాయి. దాంతో 2024 ఎన్నికల్లో అక్కడ ఎలాగైనా గెలవాలని ఆశిస్తున్న టీడీపీకి ఇటీవల కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. విజయవాడ అభివృద్ధి కోసం తాను ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు రెడీ అంటూ బాహాటంగానే ఆయన ప్రకటించారు.

విజయవాడలో కేశినేని నానీని రాబోవు ఎన్నికల్లో పక్కన పెట్టాలనే ఉద్దేశంలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతని సోదరుడు కేశినేని శివనాథ్‌కి టీడీపీ నేతలు మద్దతుగా నిలుస్తూ ఎంకరేజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. దాంతో కేశినేని నాని వైసీపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని.. ఈ క్రమంలో నందిగామ అభివృద్ధి కోసం ఎంపీ నిధుల్ని కూడా విడుదల చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ, కేశినేని నాని మధ్య దూరం పెరుగుతుండటంతో మరోవైపు వైసీపీ నేతలు అతడ్ని పార్టీలోకి తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు.

వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి బహిరంగంగానే కేశినేని నాని పార్టీలోకి వస్తానంటే నిరభ్యంతరంగా ఆహ్వానిస్తామని చెప్పారు. మరోవైపు కేశినేని నాని కూడా టీడీపీ తరఫున రాబోవు ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోతే నష్టమేమి లేదని.. కేశినేని భవన్‌లో కూర్చుని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాని స్పష్టం చేశారు. దాంతో ఇప్పుడు టీడీపీ ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది. వైసీపీ నేతలతో క్లోజ్‌గా కేశినేని నాని తిరుగుతున్నా క్రమశిక్షణ చర్యలు తీసుకునే సాహసం ఇప్పట్లో టీడీపీ చేయకపోవచ్చు. అలా అని మౌనంగా చూస్తూ ఉండలేదు. ఓవరాల్‌గా విజయవాడలో కేశినేని నాని కారణంగా టీడీపీ ఓ సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది.

First Published:  31 May 2023 5:58 AM GMT
Next Story