చీరాల వైసీపీ టికెట్ బలరాంకి నై..? సునీతకి సై..!
ఇక టీడీపీ నుంచి కరణం బలరాంని తన పాత నియోజకవర్గానికి పంపిస్తే.. ఇక్కడి నుంచి పోతుల సునీతని బరిలోకి దింపొచ్చనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో సీటు ఫైటు హాట్ హాటుగా సాగుతోంది. ఓడిపోయినవాళ్లు, గెలిచినవాళ్లంతా టీడీపీ నుంచి వైసీపీలో చేరడంతో ఇక్కడ `ఫ్యాన్` పార్టీకి ఓవర్ లోడ్ అయ్యింది. వివిధ కుల సమీకరణాలతో ఎవ్వరినీ వదులుకోలేని సంకట స్థితిలో వైసీపీ అధిష్టానం ఉంది. టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం, టీడీపీ టికెట్ ఆశించి ఎమ్మెల్సీతో సరిపెట్టుకున్న పోతుల సునీత వైసీపీలో చేరారు. వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్ ఉండనే ఉన్నారు.
ఒక సీటుకి ముగ్గురు పోటీ పడుతుండటంతో వైసీపీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. చివరికి ఆమంచి కృష్ణమోహన్ ని పర్చూరు వైసీపీ సమన్వయకర్తగా పంపించి ఒకరిని పోటీ నుంచి తగ్గించగలిగారు. అయితే కరణం బలరాం, పోతుల సునీతల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. చీరాల నియోజకవర్గంలో బీసీ ఓటర్లు గణనీయంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీచేస్తే వైసీపీకి చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో సోషల్ ఇంజనీరింగ్ చేసి అభ్యర్థుల్ని నిర్ణయించాలని వైసీపీ వ్యూహకర్తలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
వైసీపీలో కొంత వ్యతిరేకత మూటగట్టుకున్న ఆమంచి అడ్డు తొలగింది. ఇక టీడీపీ నుంచి కరణం బలరాంని తన పాత నియోజకవర్గానికి పంపిస్తే.. ఇక్కడి నుంచి పోతుల సునీతని బరిలోకి దింపొచ్చనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. చేనేత సామాజికవర్గానికి చెందిన పోతుల సునీతని దింపితే బీసీ ఓట్లు బాగా లాక్కోవచ్చనే వ్యూహం పరిశీలిస్తున్నారు. ఇదే జరిగితే కరణం బలరాంని అద్దంకి నియోజకవర్గానికి పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. తన కొడుకు కరణం వెంకటేశ్‌కి సీటు హామీతో బలరాం వైసీపీలో చేరారని, ఇప్పుడు తండ్రిని అద్దంకికి పంపితే.. కొడుకుకి ఎక్కడ సీటు ఇస్తారనేది అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో కరణం వెంకటేష్ సీఎం జగన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారని, అయితే సజ్జల సముదాయించి పంపారని టాక్ బయటకొచ్చింది.