పేదలు, మహిళలు వైసీపీ వైపే.. సజ్జల ధీమా
తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎంత రెచ్చగొట్టినా వైసీపీ కార్యకర్తలు ఎక్కడా రెచ్చిపోలేదన్నారు సజ్జల. తమకు పోలింగ్ ప్రశాంతంగా జరగడం కావాలన్నారు.
ఏపీలో పోలింగ్ జరిగిన తీరుపై స్పందించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. మహిళలు, పేదలు వైసీపీ వైపే ఉన్నారని చెప్పారు. వైసీపీకి సానుకూల ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశించిన మేరకు రాష్ట్రంలో పోలింగ్ జరిగిందన్నారు. 2019లోనూ ఇదే తరహాలో పోలింగ్ జరిగిందన్నారు. ఆ టైంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా పోలైందని.. ఈసారి మాత్రం ప్రభుత్వ సానుకూల ఓటు పెద్ద ఎత్తున పోలైందన్నారు.
ఇక తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎంత రెచ్చగొట్టినా వైసీపీ కార్యకర్తలు ఎక్కడా రెచ్చిపోలేదన్నారు సజ్జల. తమకు పోలింగ్ ప్రశాంతంగా జరగడం కావాలన్నారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏకపక్షంగా దాడులు చేశారని చెప్పారు సజ్జల.
పలు నియోజకవర్గాల్లో పోలీసులతో టీడీపీ కుమ్మక్కై.. రిగ్గింగ్‌కు పాల్పడిందని సంచలన ఆరోపణలు చేశారు. కుప్పం, మాచర్ల, సత్తెనపల్లి, అద్దంకి, పొన్నూరు, అమలాపురం, వినుకొండ నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగిందన్నారు. దాదాపు 80 ఘటనలపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు సజ్జల.