తప్పదు.. మరో దారి లేదు.. రంగంలోకి వైసీపీ మహిళా నేతలు
జగన్ దగ్గర ప్రచార విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో చాలా మంది విశ్వాసపాత్రులన్న ట్యాగ్‌తో పదవులు తెచ్చుకున్నవారు కావడంతో.. టీడీపీ దాడిని అంతే తీవ్రంగా తిప్పికొట్టడంలో తడబడుతున్నారు.
ఏదో ఒక పార్టీనే బాధ్యులం చేయలేం గానీ.. ఏపీలో రాజకీయాలు, నేతలు వాడే భాష ఏనాడో అధమ స్థాయికి చేరిపోయింది. బుద్ధిగా మాట్లాడేవారి కంటే బూతులు మాట్లాడే వారే ఎక్కువ అటెన్షన్ డ్రా చేయగలుగుతున్నారు. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చేసిందని భావిస్తున్న టీడీపీ కూడా.. ఇటీవల బాగా డోస్ పెంచేసింది. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎవరినైనా సరే.. టీడీపీ నేతలు మీడియా సమావేశాల్లో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. టీడీపీ నెట్‌వర్క్ పక్కాగా పనిచేస్తోంది. దాంతో వైసీపీకి బాగానే డ్యామేజ్ జరుగుతోంది. జగన్ దగ్గర ప్రచార విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో చాలా మంది విశ్వాసపాత్రులన్న ట్యాగ్‌తో పదవులు తెచ్చుకున్నవారు కావడంతో.. టీడీపీ దాడిని అంతే తీవ్రంగా తిప్పికొట్టడంలో తడబడుతున్నారు.
టీడీపీ నుంచి అనిత, పట్టాభి, ఆనం వెంకటరమణారెడ్డి ఇలాంటి వారు చాలా ధాటిగా దాడి చేస్తున్నారు. ముఖ్యంగా అనిత సీఎంపైనా, ఆయన కుటుంబసభ్యులపైనా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. దాంతో వైసీపీ కూడా మహిళా నేతలనే రంగంలోకి దింపింది. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మహిళా నేత రోజా రాణి లాంటి వారిని వైసీపీ రంగంలోకి దింపింది. రోజారాణితో ఇటీవల పదేపదే మీడియా సమావేశాలు పెట్టిస్తున్నారు. రోజారాణి.. అనితను బాగా టార్గెట్ చేస్తున్నారు. ఆమె, ఈమె చేసుకుంటున్న విమర్శలు, ఆరోపణలు అన్ని హద్దులు దాటేసినట్టుగానే ఉంటున్నాయి. ఓసేయ్, ఏమేయ్, దొంగ ము*, ఇలాంటి పదాలతో పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. గతంలో చేసిన రికార్డింగ్ డ్యాన్స్‌లు, తెరిచిన ''ఆ'' టైప్ కంపెనీలు వంటి వాటి గురించి పరస్పరం మాట్లాడుకుంటున్నారు. సబ్జెక్ట్ ఎవరికి కావాలి.. అవతలి వారిపై బుల్లెట్ లాంటి బూతులు పేల్చామా లేదా అన్నట్టుగా ఏపీలో రాజకీయ పార్టీల తీరు ఉంది.
అచ్చం పాతికేళ్ల క్రితం వీధి కుళాయిల దగ్గర వాడే భాషే ఇది. ఇప్పుడు దిగజారిన రాజకీయాల పుణ్యమా అని మీడియాలోనూ చూడాల్సి వస్తోంది. అయితే ఇంత వల్గర్‌గా తిట్టుకునే నేతల మీడియా సమావేశాలను ఆయా పార్టీలు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా లైవ్ ఇవ్వడం ద్వారా మరింత ప్రోత్సహిస్తున్నాయి. ఈ వ్యవహారం ఇంతటితో ఆగేది కాదు. అన్ని హద్దులు చెరిపేసుకుంటూ పోటాపోటీగా సాగుతున్న ఈ బూతుల రాజకీయంలో.. నేతలు, వారి కుటుంబంలోని ఆడవారి పరువు ప్రతిష్టలను కూడా పరస్పరం బజారు మీదకు తెచ్చుకునే రోజులైతే ఎంతో దూరం లేవనిపిస్తోంది.