పవన్ విషయంలో వ్యూహాత్మకమేనా?
వచ్చే ఎన్నికల్లో జగన్ ఫైటంతా ఎల్లో మీడియా, పవన్‌తోనే అన్న కలరింగ్ ఇవ్వటమే వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది.
క్షేత్రస్థాయిలో జరిగేది చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో వైసీపీ చాలా వ్యూహాత్మకంగా నడుచుకుంటున్నట్లే ఉంది. ఎందుకంటే వారాహియాత్ర మొదలైన దగ్గర నుండి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలంతా తమ టార్గెట్‌ను జనసేనపైనే ఉంచారు. కావాలనే చంద్రబాబునాయుడు, టీడీపీని దూరంపెట్టినట్లు సమాచారం. తమ ప్రధాన టార్గెట్ ఎల్లో మీడియా తర్వాత పవన్ మాత్రమే అని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పదలచుకున్నట్లు అర్థమవుతోంది.
ఎందుకంటే పవన్‌కు కావాలనే మీడియాలో బాగా హైప్ వచ్చేట్లు చేయాలని వైసీపీ ప్లాన్ చేసుకున్నదట. తను బాగా హైలైట్ అయ్యేకొద్దీ జనసేన ఒంటరిగా పోటీచేసినా అధికారంలోకి వచ్చేయటం ఖాయమన్న భ్రమల్లో పవన్‌ను ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే రేపటి ఎన్నికల్లో టీడీపీతో పొత్తు నుండి పవన్ దూరంగా జరిగేట్లు చేయటమేనట. ఒకవేళ చంద్రబాబు-పవన్ పొత్తు పెట్టుకోవటాన్ని అడ్డుకోలేకపోయినా వీలైనంతలో ఎక్కువ సీట్లను పవన్‌తో డిమాండ్ చేయించటమే వైసీపీ టార్గెట్.
జనసేన ఎన్ని ఎక్కువ సీట్లు తీసుకుంటే అంతమేర టీడీపీకి నష్టమన్నది వైసీపీ ఆలోచన. జనసేన నుండి టీడీపీకి ఓట్ల బదలాయింపు జరిగినా టీడీపీ నుండి జనసేనకు ఓట్ల బదలాయింపు జరగదనే చర్చ రెండు పార్టీల్లోనూ బాగా జరుగుతోంది. కొద్దిరోజులుగా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు, టీడీపీని ముఖ్యంగా లోకేష్ గురించి పెద్దగా మాట్లాడటంలేదు. కావాలనే పదేపదే పవన్‌ను మాత్రమే టార్గెట్ చేసి మీడియాలో బాగా హైలైట్ అయ్యేట్లు చేస్తున్నారు.
ఇందుకు తాజా ఉదాహరణ మంత్రి అంబటి రాంబాబు వ్యవహారమే. అంబటి వ్యూహాత్మకంగా కొత్తగా రిలీజైన సినిమా బ్రోను ప్రస్తావించారు. మనీల్యాండరింగ్ ద్వారా అందిన డబ్బుతో బ్రో సినిమా తీశారని, పవన్ రెమ్యునరేషన్ అంతా చంద్రబాబు ప్యాకేజీయేనని అంబటి పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలతో సరిపెట్టుకోకుండా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయటం కోసం ఢిల్లీకి చేరుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఫైటంతా ఎల్లో మీడియా, పవన్‌తోనే అన్న కలరింగ్ ఇవ్వటమే వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. మరీ దీనివల్ల వైసీపీకి ఏ మేరకు లబ్దిజరుగుతుందో చూడాలి.