Telugu Global
Andhra Pradesh

భయపడ్డారా..? బాధపడ్డారా..? పాదయాత్రపై ఆగని కౌంటర్లు..

అమరావతి రైతుల యాత్రని టీడీపీ అనుకూల మీడియా మినహా ఇంకెవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ వైసీపీ మీడియా పదే పదే తమ నేతల విమర్శలను హైలెట్ చేస్తూ యాత్ర చేస్తున్నారొహో అంటూ చాటింపు కొడుతోంది. యాత్రకు లేనిపోని ప్రచారం కల్పిస్తోంది.

భయపడ్డారా..? బాధపడ్డారా..? పాదయాత్రపై ఆగని కౌంటర్లు..
X

అమరావతి రైతుల పాదయాత్ర అరసవెళ్లి దిశగా వెళ్తోంది. ఈ యాత్ర మొదలు పెట్టిన రోజు నుంచీ వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. యాత్రలో రైతులు లేరని, అది రియల్ ఎస్టేట్ వ్యాపారుల యాత్ర అని, ఉత్తరాంధ్రపై దండెత్తుతున్నారని మండిపడుతున్నారు. తమ ప్రాంతానికి వచ్చి తమకే శాపనార్థాలు పెడితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ, హైకోర్టు అనుమతితో యాత్ర మొదలు పెట్టిన తర్వాత ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకో అర్థం కావడంలేదు. యాత్ర విషయంలో వైసీపీ నేతలే అనవసర ప్రచారం కల్పిస్తున్నారు. వాస్తవానికి యాత్రని టీడీపీ అనుకూల మీడియా మినహా ఇంకెవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ వైసీపీ మీడియా పదే పదే తమ నేతల విమర్శలను హైలెట్ చేస్తూ యాత్ర చేస్తున్నారొహో అంటూ చాటింపు కొడుతోంది. ఈ యాత్రకు లేనిపోని ప్రచారం కల్పిస్తోంది వైసీపీ నేతలే.

అధికారం వైసీపీ చేతుల్లో ఉంది. 3 రాజధానులతో అభివృద్ధి వికేంద్రీకరణ ఆశించిన స్థాయిలో జరగదు అనుకుంటే మరో రెండు రాజధానులు కూడా అదనంగా పెట్టుకోవచ్చు. ఎలాగూ వచ్చేసారి 175 అసెంబ్లీ స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు కాబట్టి, అసలు వైసీపీ మాటకు తిరిగే ఉండదు. ప్రతిపక్షం లేని అసెంబ్లీలో అన్ని బిల్లులూ ఆల్ పాస్. కనీసం నిరసన తెలపడానికి కూడా ఎవరూ ఉండరు కాబట్టి.. అసలు ఇబ్బందే ఉండదు. మరి ఈ హడావిడి అంతా ఇప్పుడెందుకు..?

గత అసెంబ్లీలో మరోసారి మూడు రాజధానుల బిల్లు పెడతారని అనుకున్నా.. జగన్ ఆ సాహసం చేయలేదు. కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ గురించి ప్రస్తావించి వదిలిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రధాన అజెండాగా వైసీపీ ప్రచారం నిర్వహించే అవకాశముంది. అమరావతి ప్రాంత వాసులు కూడా స్థానిక ఎన్నికల్లో వైసీపీకే మద్దతిచ్చారు కాబట్టి, రేపు సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందనే అంచనాలున్నాయి. అంటే.. వైసీపీ ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేనే లేదు. ఉత్తరాంధ్ర మంత్రులు చేస్తున్న విమర్శలతో ఉద్విగ్న వాతావరణం నెలకొంటోంది. అమరావతి రైతుల యాత్రతో శాంతి భద్రతల సమస్య తలెత్తితే మాత్రం అది రాజకీయ స్వలాభం కోసం పార్టీలు చేసిన పాడుపని అనుకోవాల్సిందే. తిరుపతి యాత్రతో రైతులు ఏం సాధించారో, అరసవెల్లి యాత్రతో కూడా అదే జరుగుతుంది అని వైసీపీ సంయమనం పాటిస్తేనే యాత్రల విషయంలో గంరగదోళం ఆగిపోతుంది.

First Published:  6 Oct 2022 4:49 PM IST
Next Story