ఎన్నికల డేటాతో పవన్‌కు వైసీపీ కౌంటర్
పవన్ కల్యాణ్ ఆరోపణలకు వైసీపీ గట్టిగా కౌంటర్ ఇస్తోంది. పవన్ కల్యాణ్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని వైసీపీ ఆరోపిస్తూ ఎన్నికల డేటాను వెలికితీసింది.
గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు అనేక ప్రయత్నాలు చేశారని అందులో భాగంగా భీమవరంలో ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వేయించారంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపణ చేశారు. ఈ ఆరోపణలకు వైసీపీ గట్టిగా కౌంటర్ ఇస్తోంది. పవన్ కల్యాణ్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని వైసీపీ ఆరోపిస్తూ ఎన్నికల డేటాను వెలికితీసింది.
అసలు గాజువాక, భీమవరంలో ఓటు హక్కు ఉండి కూడా ఓటేయని వారు భారీగా ఉంటే.. పవన్ కల్యాణ్ మాత్రం ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వేశారని ఎలా చెబుతున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది. గాజువాకలో మొత్తం మొత్తం 3,10,011 ఓట్లు ఉండగా.. పోలైన ఓట్లు మాత్రం 1,99,284. మొత్తం పోలింగ్ 64.28 శాతం. ఇంకా ఓటు వేయని వారి సంఖ్య లక్షా 10వేలకు పైగానే ఉంది.
భీమవరంలో మొత్తం 2,46,424 ఓట్లు ఉండగా ఓలైన ఓట్లు మాత్రం లక్షా 92వేల 61 మాత్రమే. పోలింగ్ శాతం 77.94 శాతం. ఇంకా ఓటు వేయని వారు 50వేల మందికి పైగానే ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి అని ఎలా చెబుతారని వైసీపీ ప్రశ్నిస్తోంది. పైగా అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీని కాదని వైసీపీ దొంగ ఓట్లు వేయించే అవకాశం ఉంటుందా అని ప్రశ్నిస్తోంది. యాధేచ్ఛగా అవాస్తవాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం పవన్‌కు అలవాటుగా మారిందని వైసీపీ విమర్శిస్తోంది.