తెరపైకి వారసులొచ్చారు.. హిట్టా.. ఫట్టా..?
జగన్ చేస్తున్న, చేయబోతున్న మార్పులన్నీ గెలుపు ప్రాతిపదికగా చేస్తున్నవే. వైనాట్ 175 అనే టార్గెట్ ప్రకారమే జగన్ ఇవంతా చేస్తున్నారు. రకరకాల ఫీడ్ బ్యాక్ ఆధారంగా గతంలో ఎవరు చేయని విధంగా సాహసం చేస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయంలో వారసులు తెరపైకి వచ్చేశారు. వైసీపీ ఇప్పటి వరకు ప్రకటించిన టికెట్లలో సుమారు ఆరుమంది వారసులు పోటీచేయటం ఖాయమైంది. వీళ్ళంతా చాలాకాలంగా తండ్రులతో పాటు నియోజకవర్గాల్లో ఫుల్ టైమ్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నవారే. కాకపోతే అధికారికంగా పార్టీ టికెట్లు ప్రకటించింది మాత్రం మంగళవారమే. ఇదే వరుసలో ఇంకా కొంతమంది సీనియర్లు తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్టు చేస్తున్నారు.
తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డికి బదులు భూమన అభినయరెడ్డికి టికెట్ దక్కింది. అలాగే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డికి బదులు ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి పార్టీ టికెట్ ప్రకటించింది. మచిలీపట్నంలో పేర్నినానికి బదులు ఆయన కొడుకు పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) పోటీ చేయబోతున్నారు. రామచంద్రాపురంలో ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు పిల్లి సూర్యప్రకాష్ కు టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం ఇక్కడ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి చెల్లుబోయిన పోటీచేయబోతున్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే షేక్ ముస్తాఫాకు బదులుగా ఆయన కూతురు నూరి ఫాతిమాకు పార్టీ టికెట్ కేటాయించింది. వీళ్ళ తరహాలోనే తమ వారసులకు టికెట్లు కేటాయించాలని మరికొందరు సీనియర్లు జగన్ను రిక్వెస్టుచేస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, శెట్టిపల్లి రఘురామిరెడ్డి లాంటి మరికొందరు సీనియర్లు కూడా వారసులకోసం టికెట్లు అడుగుతున్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తన వారసుడికి టికెట్ అడిగారు. వారసుడికి కాదు కదా అసలు ఎమ్మెల్యేకే జగన్ టికెట్ నిరాకరించారు.
జగన్ చేస్తున్న, చేయబోతున్న మార్పులన్నీ గెలుపు ప్రాతిపదికగా చేస్తున్నవే. వైనాట్ 175 అనే టార్గెట్ ప్రకారమే జగన్ ఇవంతా చేస్తున్నారు. రకరకాల ఫీడ్ బ్యాక్ ఆధారంగా గతంలో ఎవరు చేయని విధంగా సాహసం చేస్తున్నారు. జగన్ సాహసం వర్కవుటైతే మంచి మెజారిటితో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావటంఖాయం. అదే ఫెయిలైతే అతితక్కువ సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సుంటుంది. పార్టీకి కర్త, కర్మ, క్రియా అంతా జగనే కదా. మరి ముందు ముందు ఇంకెన్ని మార్పులుంటాయో చూడాలి.