Telugu Global
Andhra Pradesh

వైసీపీ, జనసేనలో గాడిదల గోలేంటో..?

వైసీపీలోని నేతలను గాడిదలంటూ పవన్ కావాలనే రెచ్చగొట్టారు. దాంతో పవన్ కు వ్యతిరేకంగా రెచ్చిపోయేందుకు సదా సిద్ధంగా ఉండే మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయారు. పవనే అడ్డగాడిదంటూ ట్విట్టర్లో కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు.

వైసీపీ, జనసేనలో గాడిదల గోలేంటో..?
X

తమ మానాన తమ పనిచేసుకుని పోతున్న గాడిదలను రాజకీయనేతలు సీన్ లోకి లాగి మరీ అవమానిస్తున్నారు. గాడిదల్లో ఏ గాడిద కూడా మరో గాడిదను ఇబ్బందుల్లోకి నెట్టినట్లు ఎవరు చూడలేదు, వినలేదు. అలాంటిది మోయలేని భారానికి మించి మోస్తూ తమ యజమానులకు సేవచేసుకుంటున్న గాడిదలను జనసేన, వైసీపీ నేతలు అనవసరంగా పిక్చర్లోకి లాగి మరీ అవమానిస్తున్నారు. మనుషులకు ఇచ్చినట్లే భగవంతుడు గాడిదలకు కూడా నోరిచ్చుంటే అప్పుడు తెలిసేది నేతల అసలు భాగోతం.

ఇంతకీ విషయం ఏమిటంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ దగ్గర కొత్తగా ఏమీలేదు. అందుకనే గాడిదల రాగం అందుకున్నారు. తన వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్లమీద తిరుగుతానని ప్రకటించారు. దమ్ముంటే ఏ గాడిద అడ్డొస్తుందో చూస్తానంటూ రెచ్చగొట్టే వ్యాఖ్య‌లు చేశారు. తాము సిద్ధాంతాల గురించి మాట్లాడుతుంటే వైసీపీలోని కొన్ని గాడిదలు అడ్డుగోలుగా అరుపులు పెడుతున్నాయని విరుచుకుపడ్డారు.


వైసీపీలోని నేతలను గాడిదలంటూ పవన్ కావాలనే రెచ్చగొట్టారు. దాంతో పవన్ కు వ్యతిరేకంగా రెచ్చిపోయేందుకు సదా సిద్ధంగా ఉండే మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయారు. పవనే అడ్డగాడిదంటూ ట్విట్టర్లో కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. టీడీపీని అధికారంలోకి తేవటమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడును మోస్తున్న అడ్డగాడిద పవనే అంటు అంబటి ట్విట్టర్లో పోస్టు పెట్టారు. దానికి జనసేన నేతలు రాయపాటి అరుణ, సందీప్ రెచ్చిపోయి అంబటే కంచర గాడిదంటూ ఘాటుగా రియక్టయ్యారు. అంబటి లాంటి కంచరగాడిద‌ తప్ప వైసీపీలో మాట్లాడేందుకు మరో కంచరగాడిదే లేదా అంటూ వైసీపీలో అందరూ గాడిదలే అన్నట్లుగా రెచ్చిపోయారు.

ఎప్పుడైతే వైసీపీలో గాడిదలు అంటూ జనసేన నేతలు ట్విట్లర్లో పోస్టులు పెట్టారో వైసీపీ నేతలు కూడా ట్విటర్లలో జనసేన గాడిదలంటూ కౌంటర్లు మొదలుపెట్టారు. ఇదంతా చూస్తున్న జనాలకు అసలీ గాడిదల గోలేంటో అర్థంకావటంలేదు. పవనే గాడిదంటూ అంబటి.. అంబటే గాడిదంటూ పవన్.. కాదు మీరే కంచరగాడిదంటూ జనసేన నేతలు తిట్టుకోవటాన్ని చూసిన జనాలు వీళ్ళు వాళ్ళు కాదు తిట్టుకుంటున్న వాళ్ళందరినీ ఒకే గాటన కట్టేస్తే అప్పుడు ఏమవుతుందబ్బా..?

First Published:  20 Dec 2022 7:24 AM GMT
Next Story