బందరు, అవనిగడ్డల్లో వైసీపీ సింహనాదం
సింహాద్రి కుటుంబం అదే సామాజికవర్గం కావడం, సింహాద్రి సత్యనారాయణ కుటుంబానికి అన్ని వర్గాల ప్రజల్లో ఉన్న మంచి పేరు ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపునకు మరింత దోహదం చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
కృష్ణా జిల్లా రాజకీయాల్లో తిరుగులేని గుర్తింపు ఉన్న సింహాద్రి కుటుంబం నుంచి ఇద్దరికి వైసీపీ సీట్లిచ్చింది. దివంగత నేత, ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలలో మంత్రిగా పనిచేసిన సింహాద్రి సత్యనారాయణ కుటుంబం నుంచి వచ్చిన సింహాద్రి రమేష్‌బాబు అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ఆయన్ను పక్కనపెట్టిన వైసీపీ అధిష్టానం ఆ స్థానంలో రమేష్‌బాబును ఎంపీగా బరిలో నిలపనున్నట్లు ప్రకటించింది. ఆయన ఖాళీ చేస్తున్న అవనిగడ్డ స్థానంలో మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారుడు డాక్టర్ చంద్రశేఖరరావు అభ్యర్థిత్వం ఖరారు చేసింది.
బలమైన సామాజికవర్గం, కుటుంబ పేరు ప్రఖ్యాతలు
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో కాపుల ఓట్లు ఎక్కువ. సింహాద్రి కుటుంబం అదే సామాజికవర్గం కావడం, సింహాద్రి సత్యనారాయణ కుటుంబానికి అన్ని వర్గాల ప్రజల్లో ఉన్న మంచి పేరు ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపునకు మరింత దోహదం చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
క్యాన్సర్ వైద్యునిగా పేరొందిన చంద్రశేఖరరావు
సింహాద్రి సత్యనారాయణ కుమారుడైన చంద్రశేఖరరావు క్యాన్సర్ వైద్య నిపుణుడిగా విశేష పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. హైదరాబాద్‌లోని సౌమ్య ఆస్పత్రిలో క్యాన్సర్ రోగులు ఎంతో మంది చికిత్స తీసుకుంటుంటారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వందలాది మంది క్యాన్సర్ రోగులు చంద్రశేఖరరావు దగ్గర వైద్యానికి వస్తుంటారు. తండ్రి వారసత్వమే కాదు తన వ్యక్తిగత పేరు ప్రతిష్టలు కూడా కలిసివచ్చి చంద్రశేఖరరావుకు విజయం నల్లేరుపై నడకే అంటున్నారు.