పవన్ ప్యాకేజీ.. అంతా..?
హవాలా మార్గంలో ఆ సొమ్మంతా రష్యా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాలకు తరలిపోయిందని ఆయన చెప్పారు. రాజకీయ పొత్తుల వ్యవహారంలో భాగంగానే ఆయన ఈ సొమ్ము అందుకున్నారని ఆయన తెలిపారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండటం తెలిసిందే. చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుని పనిచేస్తున్నాడని, అందుకే 2014 ఎన్నికల్లో అసలు పోటీచేయకుండా టీడీపీకి మద్దతిచ్చాడని, 2019లో చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీతో పొత్తు లేకుండా పోటీచేశాడని.. తద్వారా టీడీపీ వ్యతిరేక ఓటు చీల్చాలనేది వారి ఉద్దేశమని వైసీపీ నేతలు తరచూ విమర్శించేదే. ప్యాకేజీ స్టార్ అంటూ తనపై చేస్తున్న విమర్శలపై పవన్ కూడా సీరియస్‌గా రియాక్టవడం తెలిసిందే. అయినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
వాస్తవంగా చూస్తే.. పవన్ కల్యాణ్ తీరు కూడా అలాగే ఉంటుంది. ఏదైనా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారంటే.. అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యం. కానీ, పవన్ కల్యాణ్ ఎప్పుడూ తన పార్టీని అధికారంలోకి తెచ్చే ప్రయత్నాలే చేయలేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన రాజకీయం మొత్తం చంద్రబాబుకు ప్రయోజనం కలిగించే దృక్కోణంలోనే చేస్తున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబుకు ఇబ్బంది కలిగినప్పుడు ఒక్కసారిగా బయటికొచ్చి.. హడావుడిగా కార్యక్రమాలు చేసి.. వైసీపీపై ఆరోపణలు చేసి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం తెలిసిందే. అంతే తప్ప తన పార్టీని, పార్టీ కేడర్‌ను బలోపేతం చేసే ప్రయత్నాలు ఎక్కడా కనిపించవు.
ప్యాకేజీ సొమ్ము రూ.1400 కోట్లట..
తాజాగా పవన్ ప్యాకేజీపై వైసీపీ నేతలు మరో అడుగు ముందుకేసి ఆయన అందుకున్న ప్యాకేజీ రూ.1400 కోట్లని తేల్చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి శనివారం మీడియా మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. హవాలా మార్గంలో ఆ సొమ్మంతా రష్యా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాలకు తరలిపోయిందని ఆయన చెప్పారు. రాజకీయ పొత్తుల వ్యవహారంలో భాగంగానే ఆయన ఈ సొమ్ము అందుకున్నారని ఆయన తెలిపారు. అంతేకాదు.. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందని కూడా చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో తనపై కాకినాడ సిటీలో గ్లాస్ గుర్తుపై అభ్యర్థిని పోటీలో పెట్టలేకపోతే ఆ క్షణాన్నే పవన్ రాజకీయంగా ఓటమి చెందినట్టు భావిస్తానని ఎమ్మెల్యే ద్వారంపూడి ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
రూ.1500 కోట్లకు అంటున్న పాల్..
ఇక పవన్‌పై ప్యాకేజీ ఆరోపణలు చేసేవారిలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆయన కూడా పవన్ కల్యాణ్ రూ.1500 కోట్లకు అమ్ముడుపోయాడని ఆరోపించారు. విశాఖపట్నంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా పవన్ చేస్తున్న వ్యాఖ్యలపైనా ఆయన స్పందిస్తూ.. పవన్ ఒకరోజు ఎన్డీఏలో ఉన్నానని, మరొక రోజు లేనని చెబుతాడని, రేపు ఏమంటారో చూడాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్టీల్ ప్లాంట్ కోసం ఏనాడూ పోరాటం చేయలేదని, ఆయన ఆదానీకి అమ్ముడుపోయాడని ఆరోపించారు పాల్. చంద్రబాబు అమరావతి కడతానని కట్టలేదని, పోలవరం పూర్తి చేయలేదని, ప్రత్యేక హోదా సాధించలేదని పేర్కొన్నారు. ఏ తప్పూ చేయకపోతే లోకేశ్ ఎందుకు ఢిల్లీలో దాక్కున్నాడని ప్రశ్నించారు.