Telugu Global
Andhra Pradesh

జగన్ సమీక్షలతో కార్యకర్తలు విసిగిపోతున్నారా ?

నియోజకవర్గంలో పార్టీ ఇబ్బందులను, మంత్రులు లేదా ఎమ్మెల్యేల్లో ఉన్న మైనస్ పాయింట్లను, పార్టీ, ప్రభుత్వంపై జనాల్లో ఎలాంటి అభిప్రాయముంది అనే విషయాలపై జగన్ ఫీడ్ బ్యాక్ తీసుకోవటం కోసమే తమతో భేటీ అవుతున్నారని అనుకున్నారు.

జగన్ సమీక్షలతో కార్యకర్తలు విసిగిపోతున్నారా ?
X

తాజాగా జరిగిన అద్దంకి నియోజకవర్గ కార్యకర్తల సమీక్షలో ఈవిషయం స్పష్టంగా బయటపడింది. కార్యకర్తలు ఒకటి అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి మరోటి చెప్పారు. అసలు జగన్ కార్యకర్తలతో భేటీ అవ్వాలని అనుకున్నది ఎందుకు..? భేటీలో జరుగుతున్నది ఏమిటి..? కార్యకర్తలతో భేటీ మొదట కుప్పం నియోజకవర్గంతో మొదలైంది. ఎంపికచేసిన ఓ 50 మంది కార్యకర్తలతో జగన్ సమావేశమవుతారని అంటే చాలామంది సంతోషించారు.

సీఎంగా ఉండి కార్యకర్తలతో భేటీ అవటం చాలా అరుదుగానే జరుగుతుంది. అలాంటిది జగన్ రెగ్యులర్ గా 175 నియోజకవర్గాల్లోని కార్యకర్తలతో భేటీ జరిపి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని అనుకున్నారు. జగన్ మొదట్లో చెప్పింది కూడా ఇదే. కానీ భేటీలో జరుగుతున్నది మాత్రం పూర్తిగా వేరు. ఎంతసేపు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాల గురించి చెప్పండి, స్కూళ్ళ రిపేర్లు గురించి చెప్పండి, గ్రామసచివాలయాల ఏర్పాటును వివరించండి, రైతు భరోసా కేంద్రాల గురించి అందరికీ వివరించమని జగన్ చెబుతున్నారు.

తన స్పీచ్ లో జగన్ ప్రధానంగా చెబుతున్నదేమంటే వచ్చేఎన్నికల్లో 175కి 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీనే గెలవాలని. నిజానికి ఇవన్నీ చెప్పటానికి కార్యకర్తలతో సమావేశం అవసరమే లేదు. ఎందుకంటే ఏదైతే జనాలకు వివరించాలని కార్యకర్తలకు జగన్ చెబుతున్నారో అవన్నీ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నవే. కార్యకర్తలు ఏమనుకున్నారంటే నియోజకవర్గంలో పార్టీ ఇబ్బందులను, మంత్రులు లేదా ఎమ్మెల్యేల్లో ఉన్న మైనస్ పాయింట్లను, పార్టీ, ప్రభుత్వంపై జనాల్లో ఎలాంటి అభిప్రాయముంది అనే విషయాలపై జగన్ ఫీడ్ బ్యాక్ తీసుకోవటం కోసమే తమతో భేటీ అవుతున్నారని అనుకున్నారు.

తాజాగా జరిగిన అద్దంకి కార్యకర్తల సమావేశంలో కూడా కార్యకర్తలు సమస్యలను చెప్పబోతే జగన్ అడ్డుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి వివరించండని అరిగిపోయిన రికార్డే వినిపించారు. జగన్ చెప్పేదాన్ని వినటానికే అయితే అసలు కార్యకర్తలతో భేటీ అవసరమే లేదని పార్టీలో చర్చ మొదలైంది. ఎందుకంటే పార్టీ నేతల సమావేశాలు, బహిరంగసభల్లో జగన్ రెగ్యులర్ గా చెబుతున్నదిదే కాబట్టి. ఇప్పటివరకు జరిగిన అన్నీ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాల్లో జగన్ చేసిందిదే. అందుకనే జగన్ తో భేటీ అంటే కార్యకర్తల్లో ఉత్సాహం కనబడటంలేదు.

First Published:  20 Oct 2022 3:40 PM IST
Next Story