వైసీపీ ఏడో జాబితా.. ఉమ్మడి ప్రకాశంలో మరో ఇద్దరు అవుట్
శాసనసభ సమావేశాలు జరుగుతుండగానే జగన్.. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డిని పిలిచి మీకు టికెట్ ఇవ్వడం లేదని.. వేరే వారిని పెడుతున్నామని చెప్పారు.
వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రకటించిన ఏడో జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులను మార్చారు. కందుకూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి మహీధర్‌రెడ్డిని, పర్చూరులో నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ను మార్చి ఆ స్థానాల్లో పూర్తిగా కొత్తవారిని నియమించారు.
మహీధర్‌రెడ్డికి టికెట్ లేదని ముందే హింట్
శాసనసభ సమావేశాలు జరుగుతుండగానే జగన్.. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డిని పిలిచి మీకు టికెట్ ఇవ్వడం లేదని.. వేరే వారిని పెడుతున్నామని చెప్పారు. ఆ అభ్యర్థిని గెలిపించుకురండి, మీకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. అయితే ఆ మాట వినగానే నేరుగా తన నియోజకవర్గంలో నిర్మాణమవుతున్న రామాయపట్నం పోర్టు నిర్వాసితులతో కలిసి పోర్టు కార్యాలయం ముందు మహీధర్‌రెడ్డి నిరసనకు దిగారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలంటూ నినదించారు. ఆరోజే ఆయనకు టికెట్ ఇవ్వరని తేలిపోయింది. ఈ నేపథ్యంలో వారం కిందటే పార్టీలో చేరిన పెంచలయ్య యాదవ్ కుటుంబంలో టికెట్ ఇచ్చారు. ఆయన కుమార్తె అరవింద యాదవ్‌కు కందుకూరు సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు.
వద్దంటున్న ఆమంచిని వదిలేశారు
మరోవైపు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చూరులో ఆయన బలమైన అభ్యర్థి అవుతారన్న ఉద్దేశంతో కొంత కాలం కిందట జగన్ అక్కడికి పంపారు. అయితే ఆమంచి తనకు చీరాలే కావాలంటూ పట్టుబట్టారు. ఇటీవల కలిసినప్పుడు కూడా నీకు పర్చూరులో గెలవడానికి ఎలాంటి సహకారం కావాలన్నా నేను చేస్తా అని జగన్ హామీ ఇచ్చినా ఆమంచి మెత్తబడలేదు. దీంతో ఆమంచి మాదిరిగానే కాపు సామాజికవర్గానికే చెందిన యడం బాలాజీకి పర్చూరు బాధ్యతలు అప్పగించారు. 2014లో చీరాల నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన బాలాజీ తర్వాత టీడీపీలో చేరారు. అక్కడా యాక్టివ్‌గా లేరు. అమెరికా వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు వైసీపీలో చేరక ముందే ఆయనకు పర్చూరు వైసీపీ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు.