యార్లగడ్డ ఎపిసోడ్ లో ట్విస్ట్ లే ట్విస్ట్ లు..
జగన్ ఎప్పటికీ హీరోయేనని ఆయన్ను తాను విమర్శించాల్సిన అవసరం లేదన్నారు యార్లగడ్డ. ఆయన చేసే పనులు కొందరికి నచ్చక పోవచ్చని అంత మాత్రాన జగన్ హీరో కాకుండా పోతారా అని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుమార్పు వ్యవహారం అసెంబ్లీలో చర్చకు రాగానే ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు. ఎన్టీఆర్ పై అభిమానంతో వైసీపీలో కూడా గొడవ మొదలైందని అనుకున్నారంతా. కానీ యార్లగడ్డకు మద్దతుగా ఎవరూ నోరు మెదపలేదు. ఆ తర్వాత ఆయన తప్పుచేశానంటూ లెంపలేసుకున్నారు. సాక్షాత్తూ శ్రీవారి సన్నిధికి వెళ్లి ఇకపై రాజకీయ వ్యాఖ్యానాలు చేయనంటూ ఒట్టు పెట్టుకున్నారు. తిరుమల దర్శనం తర్వాత బయటకొచ్చిన ఆయన.. తాను ఎప్పటికీ రాజకీయాల్లో తలదూర్చనని చెప్పారు. అంటే జగన్ వైపునుంచి బాగానే కోటింగ్ పడిందనే అనుమానం అందరికీ వచ్చింది. తప్పైపోయిందని అన్నారు కాబట్టి యార్లగడ్డ రాజీనామా వెనక్కి తీసుకున్నట్టేనని భావించారు. కానీ రెండురోజుల తర్వాత మరో ట్విస్ట్ ఇచ్చారు యార్లగడ్డ. తన పదవులకు చేసిన రాజీనామా వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నారు.
ఎన్టీఆర్ వల్ల లబ్ధిపొందిన చాలామంది ఇప్పుడు జగన్ హయాంలోనూ కీలక పదవుల్లో ఉన్నారు. అందులో యార్లగడ్డ కూడా ఒకరు. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు వ్యవహారంలో ఆయన కూడా అందరికీ టార్గెట్ అయ్యారు. ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పుకునే ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేసి పాతివ్రత్యం నిరూపించుకున్నారు. అయితే దానివల్ల ఉపయోగం లేదని వెంటనే తెలుసుకుని తిరుమలలో ప్లేటు ఫిరాయించారు. ఇప్పుడు మళ్లీ తనకు పదవులు అక్కర్లేదని అంటున్నారు. పనిలో పనిగా చంద్రబాబుని టార్గెట్ చేశారు. గతంలో ఎన్టీఆర్ కి భారత రత్న రాకుండా అడ్డుకుంది చంద్రబాబేనని, దానికి తానే ప్రత్యక్ష సాక్షిని అంటున్నారు యార్లగడ్డ. ఏపీ కొత్త రాజధానికి ఎన్టీఆర్ అనే పదం స్ఫురించేలా పేరు పెట్టాలని తాను చంద్రబాబుకి చెప్పానని, కానీ ఆయన పట్టించుకోలేదన్నారు.
జగన్ హీరో..
పేరు మార్పు ఎపిసోడ్ లో హడావిడిగా రాజీనామా చేసిన యార్లగడ్డపై వైసీపీ అభిమానుల నుంచి విమర్శల డోస్ పెరిగింది. దీంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ హీరో అని పొగిడారు. ఆనాడు ఎన్టీఆర్ పేరుని తెలుగు గంగకు పెట్టింది వైఎస్సారేనని గుర్తు చేశారు యార్లగడ్డ. జగన్ ఎప్పటికీ హీరోయేనని ఆయన్ను తాను విమర్శించాల్సిన అవసరం లేదన్నారు. ఆయన చేసే పనులు కొందరికి నచ్చక పోవచ్చని అంత మాత్రాన జగన్ హీరో కాకుండా పోతారా అని ప్రశ్నించారు. ఇంతకీ రాజీనామా చేసి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సాధించిందేంటి..? సాధించాల్సిందేంటి..? ప్రస్తుతానికి ఇవి ప్రశ్నార్థకాలే. అందుకే ఆయన సర్దుకుపోవాలని చూస్తున్నారు.