Telugu Global
Andhra Pradesh

జగన్‌,చంద్రబాబుపై యార్లగడ్డ సంచలన వ్యాఖ్యలు

హెల్త్ యూనివర్శిటీకి పేరు మార్పు నేపథ్యంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై తాను ప్రేమను వదులుకోబోనన్నారు.

జగన్‌,చంద్రబాబుపై యార్లగడ్డ సంచలన వ్యాఖ్యలు
X

హెల్త్ యూనివర్శిటీకి పేరు మార్పు నేపథ్యంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై తాను ప్రేమను వదులుకోబోనన్నారు. అయితే ఎన్టీఆర్‌ పేరును తొలగించడం మాత్రం తనను బాధించిందని అందుకే తన పదవులకు రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. సోనియాగాంధీ దేశంలో ఒక నియంతలా కొనసాగుతున్నసమయంలోనూ .. ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్రకు బయలుదేరాడని, 16 నెలలు జైల్లో పెట్టినా ఆ తర్వాత బయటకు వచ్చి రాష్ట్రమంతా తిరిగి .. సింగిల్ హ్యాండ్‌తో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని.. జగన్ ఒక హీరోనే అని యార్లగడ్డ వ్యాఖ్యానించారు. ఈ మాట అన్నాక తనను కుల ద్రోహి, జాతి ద్రోహి అంటారని అయినా తనకు ఇబ్బంది లేదన్నారు.

చంద్రబాబుపై మాత్రం యార్లగడ్డ విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు చేసిన మేలు ఏమీ లేదన్నారు. ఏపీ కొత్తరాజధానిగా ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని తాను తొలుత ప్రకటన ఇచ్చానని.. దాంతో చంద్రబాబు వెంటనే రాజగురువుతో మాట్లాడి అప్పటికప్పుడు అమరావతి అని రాజధాని పేరు ప్రకటించారన్నారు. అమరావతి అంటే దేవేంద్రుడి రాజధాని అని అక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు... ఎవడైనా కుర్చీని లాగేస్తుంటే వాడి దగ్గరకు అమ్మాయిలను పంపించడమే అమరావతిలో జరుగుతుంది.. అలాంటి పేరు ఏపీ రాజధానికి వద్దు మరోసారి ఆలోచించండి అని తాను సూచన చేశానన్నారు.

1998లో ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాల్సిందిగా వాజ్‌పేయికి లేఖ రాశారని.. ఆ తర్వాత ఒకసారి నేరుగా వెళ్లి అడిగితే తప్పకుండా వస్తుందని నాటి ప్రధాని చెప్పారని.. ఆరు నెలలు అయినా ప్రకటన రాకపోవడంతో ఆరా తీయగా చంద్రబాబే ఎన్టీఆర్‌కు భారత రత్న వద్దని చెప్పారని తేలిందన్నారు. భారత రత్న ఇస్తే భార్య హోదాలో లక్ష్మీపార్వతి తీసుకుంటుందన్న ఉద్దేశంతోనే చంద్రబాబు అడ్డుపడ్డారని.. ఈ విషయాన్ని టీడీపీ నేతలకూ చంద్రబాబు చెప్పారన్నారు.

ఎన్టీఆర్‌ కుటుంబంలోని ఒక వ్యక్తి ఇంట్లో కాల్పులు జరిగితే మీడియా మొత్తం అల్లకల్లోలం చేసిందని,ఆ మరుసటి రోజు ఉదయమే తాను నాటి సీఎం వైఎస్‌ వద్దకు వెళ్లగా... మీరెందుకొచ్చారో నాకు తెలుసు.. ఏమీ కాదు వెళ్లండి అని హామీ ఇచ్చారని.. చెప్పినట్టుగానే చిన్న ఇబ్బంది కూడా లేకుండా ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులను కాపాడారన్నారు. అదే సమయంలో బాలకృష్ణ ఆస్పత్రిలో ఉంటే... చంద్రబాబు మాత్రం పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేసి బాలకృష్ణను పరామర్శించేందుకు వెళ్లాలా వద్దా అని చర్చలు జరిపారని యార్లగడ్డ విమర్శించారు.

ఎన్టీఆర్‌పై గౌరవంతో కృష్ణా జిల్లాకు జగన్‌ ప్రభుత్వం పేరు పెట్టిందని, తెలుగు గంగ ప్రాజెక్టుకు వైఎస్‌ హయాంలో ఎన్టీఆర్ పేరు పెట్టారని యార్లగడ్డ గుర్తు చేశారు. ఇప్పటికీ జగన్‌ మీద తన ప్రేమను వదులుకోబోనని.. కాకపోతే ఎన్టీఆర్ పేరును తొలగించడం సరైనది కాదని.. వైఎస్‌ఆర్‌ ఆత్మ కూడా ఈ నిర్ణయాన్ని హర్షించదన్నారు యార్లగడ్డ.

First Published:  21 Sept 2022 4:25 PM IST
Next Story