టీడీపీతో 42ఏళ్ల అనుబంధం తెంచుకుని.. నేడు వైసీపీలోకి
టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టిక్కెట్లిచ్చారని.. పార్టీలో మొదటి నుంచి ఉన్న తనలాంటి వారెందరినో మోసం చేశారని మండిపడ్డారు యనమల కృష్ణుడు.
తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో చెప్పడానికి యనమల కృష్ణుడు ఎగ్జిట్ పెద్ద ఉదాహరణ. ఆయన చంద్రబాబుకంటే టీడీపీలో సీనియర్. పార్టీ పెట్టినప్పటి నుంచి, అంటే 42 ఏళ్లుగా అదే పార్టీలో ఉన్నారు. మధ్యలో ఎన్ని పార్టీలొచ్చినా, ఎంతమంది ఆఫర్ ఇచ్చినా బయటకు రాలేదు. అలాంటి నేతకు కూడా ఇప్పుడు జ్ఞానోదయం అయింది. టీడీపీ ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేదని తెలిసొచ్చింది. తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకోలేక బయటకు అడుగుపెట్టారు యనమల కృష్ణుడు. ఈరోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ ఇది. కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు వైసీపీలో చేరారు. యనమల కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరిక్రిష్ణ, ఎల్.భాస్కర్ వైసీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తుని ఎమ్మెల్యే అభ్యర్ధి దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్ పాల్గొన్నారు.
టీడీపీ అంటేనే మోసం..
టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టిక్కెట్లిచ్చారని.. పార్టీలో మొదటి నుంచి ఉన్న తనలాంటి వారెందరినో మోసం చేశారని మండిపడ్డారు యనమల కృష్ణుడు. టీడీపీలో 42 సంవత్సరాలుగా ఉన్నానని చంద్రబాబుతోపాటు, తన సోదరుడు యనమల రామకృష్ణుడు మోసం చేయడం వల్లే తనకు అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు బీసీలను మోసం చేశారనడానికి తానే పెద్ద ఉదాహరణ అన్నారు. ప్రజలకు సేవ చేయడానికే తాను రాజకీయాల్లో ఉన్నానని, తనకు తుని టిక్కెట్ ఇవ్వకపోగా, ఘోరంగా అవమానించారన్నారు. తునిలో ఏరోజూ యనమల రామకృష్ణుడు లేరని, ప్రజల మధ్య ఉన్నది తానేనని చెప్పారు. జగన్ పాలన చూసి తాను వైసీపీలో చేరానని.. జగన్ ని మళ్లీ సీఎం చేసేందుకు తాను కృషి చేస్తానని అన్నారు యనమల కృష్ణుడు. వైసీపీ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేస్తానని చెప్పారు.