పెద్ద యనమలపై మండిపోతున్న చిన్న యనమల
చివరకు తెరవెనుక జరిగిన మంత్రాంగంతో రామకృష్ణుడు కూతురు దివ్యను ఇన్‌చార్జిగా నియమించారు. ఇన్‌చార్జిగా ప్రకటించినంత మాత్రాన టికెట్ గ్యారెంటీ అని లేదు.
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో తనకున్న సాన్నిహిత్యంతో యనమల రామకృష్ణుడు చక్రం తిప్పారు. తుని నియోజకవర్గానికి ఇన్చార్జిగా తన కూతురు దివ్యను పార్టీ ప్రకటించేట్లుగా వ్యవహారం నడిపారు. నాలుగు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నియమించారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో బాగా వివాదాస్పదమైన తునికి దివ్యను ప్రకటించారు. పార్టీ ప్రకటన రాగానే తునిలో చిన్న యనమల మద్దతుదారులంతా ఒక్కసారిగా భగ్గుమన్నారు.
కొంతకాలంగా రాబోయే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే విషయమై అన్నదమ్ములు యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేయాలని కృష్ణుడు గట్టిగా పట్టుబడుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుతో కూడా చెప్పారు. నియోజకవర్గంలో కృష్ణుడు మద్దతుదారులంతా తీర్మానం చేసి పార్టీకి పంపారు. ఇదే సమయంలో రామకృష్ణుడు మద్దతుదారులు కూడా దివ్యకు మద్దతుగా తీర్మానాలు చేసి పంపారు. ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేని చంద్రబాబు వ్యవహారాన్ని బాగా నాన్చారు.
చివరకు తెరవెనుక జరిగిన మంత్రాంగంతో రామకృష్ణుడు కూతురు దివ్యను ఇన్‌చార్జిగా నియమించారు. ఇన్‌చార్జిగా ప్రకటించినంత మాత్రాన టికెట్ గ్యారెంటీ అని లేదు. కాకపోతే టికెట్ ఇచ్చే విషయంలో ఇన్‌చార్జిగాలకే మొదటి ప్రాధాన్యత దక్కుతుంది. పైగా రామకృష్ణుడు మాటను కాదని చంద్రబాబు వేరేవాళ్ళకు టికెట్ ఇచ్చే అవకాశాలు దాదాపు లేవు. అందుకనే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయేది దివ్యే అనే సంకేతాలు నియోజకవర్గంలో అందరికీ అర్ధమైపోయింది.
సరిగ్గా ఇక్కడే కృష్ణుడుతో పాటు ఆయన మద్దతుదారులు మండిపోతున్నారు. పార్టీకి ఇంత కష్టపడిన తనను పక్కనపెట్టడం ఏమిటని కృష్ణుడు ఏకంగా అధినేతనే నిలదీస్తున్నారు. రామకృష్ణుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినా మంత్రిగా ఉన్నా నియోజకవర్గంలో పార్టీని నడిపిందంతా తానే అన్న విషయం చంద్రబాబుకు తెలీదా అంటు మండిపోయారు. సరే యనమల సోదరుల గొడవను పక్కనపెట్టేస్తే పార్టీలో రెండో నాయకత్వం ఎదగకుండా నాశనం చేసిన వాళ్ళకే మళ్ళీ టికెటిస్తారా అంటూ ద్వితీయ శ్రేణి నేతలు గోల చేస్తున్నారు. రామకృష్ణుడైనా ఆయన కూతురైనా ఒకటే కదా అంటూ లాజిక్ లేవదీస్తున్నారు. మరి దీన్ని చంద్రబాబు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.