Telugu Global
Andhra Pradesh

NTV vs TV9 బెజవాడలో మహిళా జర్నలిస్ట్ ల కొట్లాట

ఎవరికి వారే వీడియో తీసుకుని ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టుకుని తమ పరువు తామే తీసుకున్నారు ఆ ఇద్దరు జర్నలిస్ట్ లు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

NTV vs TV9 బెజవాడలో మహిళా జర్నలిస్ట్ ల కొట్లాట
X

ఒకరు NTV రిపోర్టర్ రెహానా, ఇంకొకరు TV9 రిపోర్టర్ హసీనా. ఇద్దరూ మహిళలే, ఇద్దరూ విజయవాడలో పనిచేస్తున్నారు. వృత్తిపరంగా ఎన్నో సంవత్సరాల స్నేహం ఉంది. కానీ, అది వైరంగా మారి సోషల్ మీడియాకెక్కింది. నీ వ్యవహారమంతా నాకు తెలుసని ఒకరంటే, నీ ఈమెయిల్స్‌ కథ అంతా నా దగ్గరుందని ఇంకొకరు.. ఇలా తమపరువు తామే తీసుకున్నారు. ఈ గొడవంతా ఇంకెవరో వీడియోతీసి బయటపెడితే అది మరోలా ఉండేది. కానీ ఎవరికి వారే వీడియో తీసుకుని ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టుకుని తమ పరువు తామే తీసుకున్నారు ఆ ఇద్దరు జర్నలిస్ట్ లు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


కుట్ర, ద్రోహం..

ఇటీవల NTV, TV9 మధ్య రేటింగ్స్ గొడవ మామూలుగా లేదు. రెండు ఛానళ్లకు సంబంధించిన జర్నలిస్ట్ లు వాట్సప్ గ్రూపుల్లో బూతులు తిట్టుకుంటున్నారు. మాది అసలైన రేటింగ్ అని ఒకరంటే, మాది సిసలైన నెంబర్-1 ఛానల్ అంటూ ఇంకొకరు కౌంటర్ ఇస్తున్నారు. కుట్ర, మోసం, దగాతో నెంబర్ 1 కాలేరంటూ ఏకంగా హోర్డింగ్ లు రోడ్డుపై పెట్టి ఈ గొడవని మరింత పెద్దది చేసింది TV9. ఈ గొడవకి, జర్నలిస్ట్ ల గొడవకి సంబంధం ఉందని చెప్పలేం కానీ, ఛానల్స్ మధ్య అంత వైరం ఉంటే, రిపోర్టర్ ల మధ్య ఇంకెంత ఆధిపత్య పోరు ఉంటుందో ఊహించలేం.



ప్రెస్ మీట్ లో నాయకులు మాట్లాడినా ప‌ర్లేదు, మళ్లీ వారితో స్పెషల్ గా ఇంటర్వ్యూలు కావాలని అడుగుతాయి యాజమాన్యాలు. దానికోసం రిపోర్టర్లు నాయకుల వద్ద హడావిడి పడుతుంటారు. ఈ క్రమంలో ఒకరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మరొకరు మధ్యలో దూరి మైక్ పెట్టడం వంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. అక్కడినుంచే అసలు గొడవ మొదలైనట్టు ఈ వీడియోలను చూస్తే అర్థమవుతుంది. యాజమాన్యాల ఒత్తిడి ఇక్కడ జర్నలిస్ట్ లపై స్పష్టంగా కనపడుతోంది. వృత్తిపరంగా తమ టాలెంట్ చూపించాలనుకునే క్రమంలో ఇలా గొడవలు పడి సోషల్ మీడియాకెక్కారు.

ప్రస్తుతం ఆ ఇద్దరు మహిళా జర్నలిస్ట్ లను యాజమాన్యాలు విజయవాడనుంచి వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. యాజమాన్యాల మెప్పుకోసం జరిగిన పోరులో చివరకు యాజమాన్యాల ఆగ్రహానికి ఆ ఇద్దరు జర్నలిస్ట్ లు గురికావాల్సి వచ్చింది. ఏ ఇద్దరి మధ్య అయినా అభిప్రాయ భేదాలు సహజం. కానీ ఇలా గొడవపడి, ఆ గొడవలను సోషల్ మీడియాలో పెట్టుకుని పరువు తీసుకోవడమే ఇక్కడ సంచలనంగా మారింది.

First Published:  21 Jun 2023 6:33 AM GMT
Next Story