ఆంధ్రాలో ఇప్పుడు బీజేపీ దారెటు? కర్ణాటక ఫలితాలతో నేలపైకి కమలం
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేనతో కలిసి వెళ్లడం కంటే.. వైసీపీతో దోస్తీనే బీజేపీకి మేలు చేయనుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ వైసీపీ మాత్రం ఈసారి కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్తోంది. దాంతో బీజేపీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న బీజేపీకి కర్ణాటక ఎన్నికల ఫలితాలు పెద్ద షాకిచ్చాయి. ఉత్తరాది రాష్ట్రాల తరహాలో హిందూ కార్డ్ ముందు పెట్టినా కన్నడవాసులు బీజేపీని తిరస్కరించడం గట్టి చెంపపెట్టు. దాంతో దక్షిణాన అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కూడా కమలానికి చేజారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫోకస్ మొత్తం తెలుగు రాష్ట్రాలపై బీజేపీ అధినాయకత్వం ఉంచబోతోంది.
వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. హుజురాబాద్, మునుగోడు ఎన్నికల ద్వారా తెలంగాణలో కాస్త పుంజుకునే ప్రయత్నం చేసినా ఫలితాలు ఆశాజనకంగా కనిపించడం లేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. తొలుత జనసేనతో దోస్తీ చేయగా.. ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు తేల్చిచెప్పేశారు. దాంతో ఇప్పుడు జనసేనతో పొత్తుని కొనసాగించాలా? లేదా వైసీపీతో స్నేహం చేయాలా? అనే సందిగ్ధంలో బీజేపీ పడిపోయింది. ఒంటరిగా పోటీ చేసే సత్తా మాత్రం ఏపీలో ఆ పార్టీకి లేదనేది స్పష్టం.
టీడీపీ-జనసేనతో కలిసి వెళ్లినా అది భవిష్యత్‌లో పార్టీకి ఏమాత్రం ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే వైసీపీ తర్వాత టీడీపీ తరహాలో సెకండ్ పార్టీగా రాష్ట్రంలో ఎదగాలనేది బీజేపీ దీర్ఘకాలిక ప్లాన్. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో వైసీపీకి పరోక్షంగా సపోర్ట్ చేసే అవకాశాలూ లేకపోలేదు. ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ సీనియర్ నేతలతో సీఎం వైఎస్ జగన్‌తో పాటు వైసీపీ నేతలు భేటీ అయ్యారు. దాంతో రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా.. కేంద్రంతో మాత్రం వైసీపీ ఫ్రెండ్లీగానే ఉంది. మరోవైపు 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల్ని దరిదాపుల్లోకి కూడా ప్రధాని మోడీ రానివ్వడం లేదు. చంద్రబాబు చాలా సార్లు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా.. మొండిచేయి ఎదురైంది. దానికి కారణం ఎన్నికలకి ముందు చంద్రబాబు మాట మార్చి బీజేపీకి వెన్నుపోటు పొడవడమే.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు దక్షిణాది బీజేపీ నేతలు మళ్లీ నేలపైకి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం క్రమంగా తగ్గుతోందని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయి. దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారం కంటే పార్టీ పుంజుకోవడంపైనే బీజేపీ అధినాయకత్వం ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేనతో కలిసి వెళ్లడం కంటే.. వైసీపీతో దోస్తీనే బీజేపీకి మేలు చేయనుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ వైసీపీ మాత్రం ఈసారి కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్తోంది. దాంతో బీజేపీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.