Telugu Global
Andhra Pradesh

అసెంబ్లీలో కిటికీలు.. బుగ్గనపై సోషల్ మీడియాలో జోకులు..

అసెంబ్లీ భవనానికి చంద్రబాబు కిటికీలు పెట్టలేదంటూ విమర్శించారు ఆర్థిక మంత్రి బుగ్గన. దీంతో టీడీపీకి దొరికిపోయారు. బుగ్గన గారికి అసెంబ్లీలో కిటికీలు కావాలంట అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు.

అసెంబ్లీలో కిటికీలు.. బుగ్గనపై సోషల్ మీడియాలో జోకులు..
X

"కిటికీలు లేవు అధ్యక్షా ఈ బిల్డింగ్ కి కూడా.. కిటికీలు లేవు, కిటికీలు ఉన్నాయా అధ్యక్షా ఎక్కడైనా..? గాలి ఆడుతుందా..? లోపల మొత్తం కిటికీలు లేని బిల్డింగ్స్ కట్టారు అధ్యక్షా.. విండోస్ లేవు ఏ బిల్డింగ్ కి కూడా..!" అసెంబ్లీ తొలిరోజు సమావేశాల్లో ఆర్థిక మంత్రి బుగ్గన ఇలా కిటీకీల వ్యాఖ్యలతో బుక్కయ్యారు. అమరావతిలో చంద్రబాబు కట్టిన బిల్డింగ్ ల గురించి ఎద్దేవా చేస్తూ బుగ్గన ఆ వ్యాఖ్యలు చేసినా.. అసెంబ్లీకి కిటికీలు ఏంటని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

అసెంబ్లీ భవనం అయినా, పార్లమెంట్ అయినా.. స్కూల్ బిల్డింగ్ లా ఉండదు. తలుపులు ఉంటాయి కానీ వాటికి కిటికీలతో పని ఉండదు. సభ్యులు తమకు తామే వాకౌట్ చేసినా, మార్షల్స్ తో బలవంతంగా పంపించినా.. దర్జాగా డోర్ ద్వారానే వెళ్తారు. పైగా ఇప్పుడన్నీ సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టమ్ కాబట్టి.. అసలు అసెంబ్లీకి కిటికీలు ఉండే అవసరం లేదు. కానీ బుగ్గన అసెంబ్లీ భవనానికి చంద్రబాబు కిటికీలు పెట్టలేదంటూ విమర్శించారు. దీంతో టీడీపీకి దొరికిపోయారు. బుగ్గన గారికి అసెంబ్లీలో కిటికీలు కావాలంట అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. అసలు సెంట్రల్ ఏసీ బిల్డింగ్ కి కిటికీలు ఎందుకో ఆయనే చెప్పాలంటూ సోషల్ మీడియాలో జోకులు పేల్చారు.

మధ్యలో ఐకియా పేరు..

అసెంబ్లీ కిటికీల వ్యవహారంలో మధ్యలో హైదరాబాద్ లోని ఐకియా కూడా తెరపైకి రావడం విశేషం. ఐకియా స్టోర్ అంత పెద్దబిల్డింగ్ అయినా మధ్యలో ఒక్క కిటికీ కూడా ఉండదని, ఆ విషయం బుగ్గనకు తెలిస్తే అది నిర్మించిన వారిపై కేసు వేస్తారంటూ జోకులు పేలుతున్నాయి. మొత్తమ్మీద రామాయణంలో పిడకల వేటలా.. రాజధాని వ్యవహారంలో బుగ్గన కిటికీల ప్రస్తావన మాత్రం హైలెట్ గా మారింది. టీడీపీ సోషల్ మీడియా విభాగానికి చేతినిండా పని చెప్పింది

First Published:  16 Sept 2022 1:21 PM IST
Next Story