ఎంపీ మాగుంట.. మళ్లీ సైకిల్ ఎక్కాల్సిందేనా..?
మాగుంటకు ఒంగోలు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. అయితే అది పూర్తిగా ఆయన సొంత బలం కాదని 2014 ఎన్నికల్లో ఓటమితో తేలిపోయింది.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈసారి వైసీపీ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని తేలిపోయింది. ఆయన స్థానంలో ఎవరన్నది ప్రస్తుతానికి పక్కనపెడితే, మాగుంట రాజకీయ భవితవ్యం ఏమిటన్నదే ఇక్కడ చర్చనీయాంశం. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తే దెబ్బతింటానని భావించి టీడీపీలో చేరి మాగుంట ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు వైసీపీ టికెట్ నిరాకరిస్తున్న నేపథ్యంలో మాగుంటకు మళ్లీ సైకిల్ ఎక్కడం తప్ప ప్రత్యామ్నాయం లేదనిపిస్తోంది.
పొరుగు జిల్లా నుంచి వచ్చి
ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. ప్రకాశం జిల్లా వ్యక్తి కాకపోయినా ఒంగోలుకు చిరకాలంగా ఆయనే ఎంపీ. నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట సుబ్బరామిరెడ్డి 1991లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంగోలు ఎంపీగా గెలిచారు. ఆయన పదవిలో ఉండగానే నక్సలైట్లు కాల్చిచంపారు. దీంతో సుబ్బరామిరెడ్డి సోదరుడు శ్రీనివాసులురెడ్డి మూడుసార్లు కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీలో చేరి 2లక్షలకు పైగా మెజార్టీతో టీడీపీ అభ్యర్థి శిద్ధా రాఘవరావుపై గెలిచారు.
కింకర్తవ్యం?
మాగుంటకు ఒంగోలు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. అయితే అది పూర్తిగా ఆయన సొంత బలం కాదని 2014 ఎన్నికల్లో ఓటమితో తేలిపోయింది. 2019లో మళ్లీ వైసీపీలో చేరాక 2 లక్షల 19వేల మెజార్టీతో గెలిచారు. అంటే ఆయన సొంతబలానికి పార్టీ (ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ) కూడా తోడయితే గానీ, గెలవలేరా అనే సందేహాలు వినిపిస్తున్నాయి.
పైగా టీడీపీలో చేరి పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో మళ్లీ సైకిలెక్కినా అదే ఫలితం వస్తుందా అనే సందేహాలూ ఉన్నాయి. పైగా ఒంగోలు లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కేవలం కొండేపిలో మాత్రమే గెలిచింది. ఈసారీ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈ నేపథ్యంలో మాగుంట ఏం చేయబోతారనేది ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది