చంద్రబాబు సిగ్నల్ ఇస్తేనే వారాహి బయటకు వస్తుందా..? పవన్ పై అంబటి ఫైర్
పార్టీ పెట్టి పదేళ్లయినా జనసేన స్థాయి రోజురోజుకూ తగ్గుతుందే కానీ, పెరగడం లేదన్నారు. 2014లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన పవన్ ఇప్పటివరకు రాజకీయంగా పెరిగిందేమీ లేదన్నారు.
గత ఏడాది దసరా నుంచే వారాహి వాహనంపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకు ఆ వాహనాన్ని బయటకు తీయలేదు. వరుసగా సినిమాలు ఒప్పుకొంటూ షూటింగ్ లలో బిజీ అయిపోయారు. దీంతో లోకేష్ పాదయాత్రకు ప్రచారం తగ్గిపోతుందని.. కావాలనే పవన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
తాజాగా మంత్రి అంబటి రాంబాబు కూడా దీనిపై పవన్ కళ్యాణ్ ను విమర్శించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సిగ్నల్ ఇస్తేనే వారాహి వాహనం బయటకు వస్తుందా? అని ప్రశ్నించారు. పవన్ ప్రచారానికి చంద్రబాబు అనుమతి కావాలన్నారు. మహిళలు వడ్డాణం చేయించుకున్నట్లు పవన్ కళ్యాణ్ వారాహి వాహనం తయారు చేయించుకొని ఇంట్లో దాచుకున్నాడని విమర్శించారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని మండిపడ్డారు. పవన్ నాయకుడు కాదు కూలి నెంబర్ వన్ అని విమర్శించారు.
పార్టీ పెట్టి పదేళ్లయినా జనసేన స్థాయి రోజురోజుకూ తగ్గుతుందే కానీ, పెరగడం లేదన్నారు. 2014లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన పవన్ ఇప్పటివరకు రాజకీయంగా పెరిగిందేమీ లేదన్నారు. ఈ దేశంలో రాజకీయాలకు అనర్హుడు ఎవరైనా ఉన్నారా.. అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే అని అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదిమంది చంద్రబాబులు, వెయ్యి మంది పవన్ కళ్యాణ్ లు అడ్డుపడినా అమరావతి ప్రాంతంలో పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చి తీరుతామని మంత్రి అంబటి స్పష్టం చేశారు.