Telugu Global
Andhra Pradesh

వంటేరుకే బాధ్యతలు అప్పగిస్తారా?

క్రాస్ ఓటింగ్ చేశారనే కారణంతో సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా ఉన్నారు. మేకపాటిని సస్పెండ్ చేసిన నాయకత్వం వెంటనే వంటేరును పిలిపించి మాట్లాడింది. అన్నీ అంశాలు సానుకూలిస్తే రెండు రోజుల్లోనే వంటేరును ఇన్‌చార్జిగా ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం.

వంటేరుకే బాధ్యతలు అప్పగిస్తారా?
X

సీనియర్ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డికి ఉదయగిరి నియోజకవర్గం ఇన్‌చార్జి బాద్యతలు అప్పగించబోతున్నారా? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. క్రాస్ ఓటింగ్ చేశారనే కారణంతో సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా ఉన్నారు. మేకపాటిని సస్పెండ్ చేసిన నాయకత్వం వెంటనే వంటేరును పిలిపించి మాట్లాడింది. అన్నీ అంశాలు సానుకూలిస్తే రెండు రోజుల్లోనే వంటేరును ఇన్‌చార్జిగా ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం.

వంటేరుకు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి, రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో పాటు జిల్లా ఇన్‌చార్జి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మద్దతుగా నిలిచారట. వంటేరును ఇన్‌చార్జిగా నియమించే విషయమై ఇప్పటికే వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడినట్లు సమాచారం. వీళ్ళంతా గట్టిగా నిలబడితే వంటేరును ఉదయగిరి ఇన్‌చార్జిగా ప్రకటించటం పెద్ద విషయం కాదు. వంటేరు కూడా బాగా సీనియర్ నేతనే చెప్పాలి. కావలి, ఉదయగిరి ప్రాంతాల్లో పట్టున్న నేతే.

ఇక ఉదయగిరి విషయం చూస్తే పార్టీ బాగా గబ్బుపట్టిపోయింది. మేకపాటి కుటుంబంలో జరిగిన అనేక గొడవల కారణంగా జనాల్లో బాగా పలుచనైపోయారు. ఎమ్మెల్యే కేంద్రంగా నియోజకవర్గంలో ఎప్పుడూ ఏదో గొడవ జరుగుతునే ఉంది. పైగా మేకపాటి నియోజకవర్గంలో కాకుండా ఎక్కువగా బెంగుళూరులోనే ఉంటారనే ఆరోపణలున్నాయి. అవసరం వచ్చినపుడు మాత్రమే ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉంటారని, అవసరానికి నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే ఆరోపణలు ఎప్పటినుండో ఉన్నాయి.

ఏదేమైనా పార్టీ నేతలు, కార్యకర్తల్లోనే కాకుండా మామూలు జనాల్లో కూడా మేకపాటి అంటే బాగా వ్యతిరేకత వచ్చేసిందట. ఇవన్నీ గమనించిన తర్వాతే రాబోయే ఎన్నికల్లో మేకపాటికి అసెంబ్లీ టికెట్ ఇచ్చేది లేదని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారు. దాంతో జగన్ పైన వ్యతిరేకత పెంచుకున్న ఎంఎల్ఏ క్రాస్ ఓటింగుకు పాల్పడినట్లు సజ్జల చెప్పారు. జగన్ పైనే కాదు ఎంఎల్ఏకి తన కుటుంబ సభ్యులు అంటే మాజీ ఎంపీ మేకపాటి రాజగోపాలరెడ్డి తదితరులతో కూడా పడటంలేదట. అన్నీ కోణాల్లో పరిశీలించిన తర్వాతే మేకపాటిని జగన్ పక్కనపెట్టేశారని చెబుతున్నారు. మరిపుడు వంటేరు నియామకంతో అయినా పార్టీ గాడినపడుతుందా ?

First Published:  25 March 2023 11:13 AM IST
Next Story